
నేటి నుంచి ఎన్నిక ప్రక్రియ షురూ
సిస్టిన్ ఛాపెల్‌లో రహస్య ఓటింగ్‌కు సిద్ధమైన కార్డినల్స్
ప్రచారంలో పలువురి పేర్లు
ముందు జాగ్రత్తగా వాటికన్ అంతటా ఫోన్ సిగ్నళ్లు బంద్
ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది క్యాథలిక్‌లకు అత్యున్నత మతాధికారిగా సేవలు అందించబోయే తదుపరి పోప్ ఎవరనే ఉత్కంఠ తీవ్రమైంది. దీనికి తెరదించడంలో భాగంగా కార్డినల్స్ బుధవారం వాటికన్ సిటీలో రహస్య ఓటింగ్‌కు సిద్ధమయ్యారు. అత్యధిక మెజారిటీ సాధించిన కార్డినల్‌కు పోప్ పదవి దక్కనుంది. 70 దేశాలకు చెందిన 133 మంది కార్డినళ్లు సిస్టిన్ ఛాపెల్‌లోకి వెళ్లి రహస్య ఓటింగ్‌లో పాల్గొనబోతున్నారు.
మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చిన వారే నూతన పోప్ అవుతారు. సిస్టిన్ ఛాపెల్‌లో ఏ కార్డినల్ ఎవరికి ఓటేశారనే విషయం పొరపాటున కూడా బయటకు పొక్కకుండా ఉండేందుకు వాటికన్ సిటీవ్యాప్తంగా అన్ని మొబైల్‌ఫోన్ల స్నిగల్స్‌ను బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఆపేయనున్నారు. నాలుగున్నర గంటలకు కార్డినళ్లు అందరూ ఛాపెల్‌లోకి వెళ్లనున్నారు. వీళ్ల ఫోన్లు, అన్నిరకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అధికారులు తీసుకుని కొత్త పోప్ ఎన్నిక తర్వాతే తిరిగి అప్పగిస్తారు. అప్పటిదాకా కార్డినళ్లను ఛాపెల్ ప్రాంగణం బయటకు కూడా అనుమతించబోరు. కొత్త పోప్ ఎన్నికల వార్త వినేందుకు ప్రజలు, మీడియా ప్రతినిధులు వేచి ఉండే ‘సెయింట్ పీటర్ స్క్వేర్’ వద్ద మాత్రం మొబైల్ నెట్‌వర్క్ పనిచేయనుంది. రహస్య ప్రక్రియలో ఎవరు పోప్‌గా పోటీపడుతున్నారనే అంశంపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే ప్రధానంగా ఐదారుగురి పేర్లు మాత్రమే వినవస్తున్నాయి. వాళ్ల గురించి క్లుప్తంగా...
పియట్రో పరోలిన్
70 ఏళ్ల ఇటలీ కార్డినల్ అయిన పియట్రో పరోలిన్ మిగతా వాళ్లతో పోలిస్తే పోటీలో ముందంజలో ఉన్నారు. గత పోప్ ఫ్రాన్సిస్ హయాంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్‌కు ప్రధాన సలహాదారుగా ఉంటూ ఇప్పటికే ఈయన డిప్యూటీ పోప్‌గా అందరికీ చిరపరిచితులు. క్యాథలిక్‌ల పాత సిద్ధాంతాల పరిరక్షణకంటే దౌత్యం, ప్రపంచవ్యాప్తంగా పోప్ ప్రతిష్టను ఇనుమడింపజేయడం మీదనే ఈయన ప్రధానంగా దృష్టిపెడతారనే వాదన ఉంది. గత 266 మంది పోప్‌లలో 213 మంది ఇటలీ దేశస్తులే. గత 40 ఏళ్లుగా ఇటలీవ్యక్తి పోప్ పదవిని అధిరోహించలేదు. ఈ లెక్కన ఈసారి ఇటలీ వర్గం ఈయనకు అత్యధిక మద్దతిచ్చే అవకాశముంది.
లూయిస్ ఆంటోనియోగోకెమ్ ట్యాగిల్
67 ఏళ్ల ట్యాగిల్ ఫిలిప్పీన్స్ దేశస్తుడు. మిగతా వాళ్లతో పోలిస్తే ఈయన చాలా సంవత్సరాలుగా పాస్టర్‌గా కొనసాగి కార్డినల్ అయ్యారు. వాటికన్ తరఫున దౌత్యవేత్తగా, చర్చి చట్టాలను కఠినంగా అమలుచేసే కార్డినళ్లతో పోలిస్తే ఈయన భిన్నమైన వ్యక్తి. ఈయన స్వదేశం ఫిలిప్పీన్స్‌లో 80 శాతం జనాభా క్యాథలిక్‌లే. పైగా కార్డినళ్లలో ఐదుగురు ఫిలిప్పీన్ దేశస్తులున్నారు. దీంతో ఈయనకు సైతం మద్దతు పలికే లాబీ బలంగా ఉందని వార్తలొస్తున్నాయి.
రాబర్ట్ ప్రివోస్ట్
69 ఏళ్ల ప్రివోస్ట్ స్వస్థలం అమెరికాలోని షికాగో. రెండేళ్ల క్రితం తదుపరి బిషప్‌ల ఎన్నికల బాధ్యతలను ఇటీవల మార్క్ ఆలెట్‌ను పక్కనబెట్టిమరీ ప్రివోస్ట్‌కు పోప్ ఫ్రాన్సిస్ కట్టబెట్టారు. ఇలా ఫ్రాన్సిస్ నుంచి మన్ననలు పొందారు. పోప్‌గా ఎన్నికైతే ఆ పీఠాన్ని అధిరోహించిన తొలి అమెరికన్ కార్డినల్‌గా చరిత్రకెక్కుతారు.
పీటర్ కోడ్వో టర్క్‌సన్
76 ఏళ్ల టర్క్‌సన్ ఘనా దేశానికి చెందిన కార్డినల్. 22 ఏళ్ల క్రితం ఘనా నుంచి కార్డినల్ అయిన తొలి వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. గత 1,500 ఏళ్లలో ఆఫ్రికా ఖండం నుంచి ఎవరూ పోప్ బాధ్యతలు చేపట్టలేదు. ఈసారి ఈయనకు సైతం గెలుపు అవకాశాలున్నట్టు తెలుస్తోంది. స్వలింగ సంబంధాలను నేరంగా చూడకూడదని ఆయన వాదించేవారు. యూరప్‌లో ఇస్లాం మతవ్యాప్తి పెరగొచ్చని గతంలో ఆందోళన వ్యక్తం చేశారు.
మారియో గ్రెక్
68 ఏళ్ల మారియో మాల్టా దేశానికి చెందిన వ్యక్తి. క్యాథలిక్‌లలో అందరితో కలుపుకొని పోయే కార్డినల్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే మొట్టమొదట వినిపించేది ఈయన పేరే. పోప్‌కు సలహాలు, సూచనలు ఇచ్చే సంఘమైన బిషప్ సైనోడ్‌కు ఆరేళ్ల క్రితమే ఈయన ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అందరి సమ్మతితో నిర్ణయాలు తీసుకోవాలనేది ఈయన ఆలోచన.
ఫ్రిడోలిన్ ఆంబోంగో బెసుంగీ
65 ఏళ్ల ఫ్రిడోలిన్ ఆఫ్రికాలోని కాంగో దేశానికి చెందిన వ్యక్తి. ఆఫ్రికా నుంచి ఏటా లక్షల సంఖ్యలో క్రైస్తవ మతంలోకి మారుతున్న నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఫ్రిడోలిన్‌కు సైతం మెండుగా ఉన్నట్లు సమాచారం. ఏడేళ్లు కిన్‌షారా ఆర్చ్‌బిషప్‌గా ఉన్న ఈయనను పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా ఎంపికచేశారు. పాత సాంప్రదాయాలకు ఈయన పట్టంకడతారు. స్వలింగ వివాహాలకు ఈయన బద్ద వ్యతిరేకి. ‘‘ క్రైస్తవుల్లో ప్రొటెస్టాంట్‌లను ప్రొటెస్టెంట్‌లుగానే ఉండనిద్దాం. ఇక ముస్లింను ముస్లింగానే బతకనిద్దాం’’ అని గతంలో వ్యాఖ్యానించారు. ఈయన వ్యాఖ్యలు క్రైస్తవాన్ని బోధించే మతప్రచారకులకు ఇబ్బందికరంగా మారాయి.
పీటర్ ఎర్డో
72 ఏళ్ల ఎర్డో హంగేరీ దేశానికి చెందిన కార్డినల్. గత 21 ఏళ్లుగా కార్డినల్‌గా కొనసాగుతూ యూరప్‌లో చర్చి వర్గాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. 2006 నుంచి పదేళ్లపాటు యూరోపియన్ బిషప్‌ల మండలి సమావేశాలను విజయవంతంగా నిర్వహించారు. తొలుత బుడాపెస్ట్ ఆర్చ్‌బిషప్‌గా పనిచేశారు. అటు ఆఫ్రికన్ కార్డినళ్లతో, ఇటు యూరప్ కార్డినళ్లతో సత్సంబంధాలున్నాయి. పోప్ పదవికి గట్టి పోటీ ఇచ్చే వీలుంది. – సాక్షి, నేషనల్ డెస్క్
పోప్ ఫ్రాన్సిస్, ఆయనకు ముందు పోప్‌గా ఉన్న బెనెడిక్ట్–16లను పోప్ పదవికి ఎన్నుకోవడానికి కార్డినళ్లకు కేవలం రెండు రోజుల సమయం పట్టింది. అయితే 1268 సంవత్సరంలో ఈ ప్రక్రియ ఎంతకీ తెమల్లేదు. దీంతో ఏకంగా 1,006 రోజులపాటు ఓటింగ్ జరిగి ఎట్టకేలకు 1271 సంవత్సరంలో పోప్‌ను ఎన్నుకున్నారు. చరిత్రలో అత్యంత సుదీర్ఘకాల ఎన్నిక ప్రక్రియ ఇదే.