
అప్పుడే రేటింగ్ అప్‌గ్రేడ్
ఆర్థిక వ్యహారాల కార్యదర్శి అజయ్‌సేత్
పెరిగిన ప్రభుత్వ రుణం మోస్తరు స్థాయికి దిగిరావాల్సి ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేత్ అన్నారు. తద్వారా వడ్డీ చెల్లింపులు తగ్గుతాయని, అప్పుడే రేటింగ్ అప్‌గ్రేడ్ అవుతుందన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అనిశ్చితులు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్ ఏదో ఒక నిర్ధిష్టమైన మార్గానికి పరిమితం కాకూడదన్నారు.
‘మారుతున్న పరిణామాలకు మనం చురుగ్గా స్పందించాలి. నేడు భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి సమీపించింది. మిగిలిన ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందన్నది తెలుసుకునేంత సామర్థ్యం మనకు ఉంది. ఈ దిశగా మనదైన మార్గాన్ని గుర్తించాలి’ అని వివరించారు. ప్రభుత్వ రుణం ప్రస్తుత స్థాయిల నుంచి కచ్చితంగా దిగిరావాలంటూ.. అందుకు ద్రవ్య స్థిరీకరణను మార్గంగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
దేశ జీడీపీలో పన్నుల వాటా దశాబ్దం క్రితం 16.5 శాతంగా ఉంటే, అది ప్రస్తుతం 18 శాతానికి చేరినట్టు అజయ్‌సేత్ తెలిపారు. ప్రస్తుత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే మరో 5–6 ఏళ్లలో 20 శాతానికి పన్నుల వాటా చేరుకోగలదన్నారు. వ్యయాల గురించి మాట్లాడుతూ.. మూలధన వ్యయాలకు అనుకూలంగా తగిన సర్దుబాట్లు జరుగుతున్నట్టు చెప్పారు.