
సరైన వ్యూహాలు, క్రమబద్ధమైన సంస్కరణలకు తోడు మౌలిక సదుపాయాలు, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించడం అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత్ బలమైన వృద్ధి సాధించడానికి దోహదం చేస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ మార్చి ఎడిషన్ నివేదిక పేర్కొంది. స్థూల ఆర్థిక స్థిరత్వం, ద్రవ్యలోటు తగ్గుతుండడం, ద్రవ్యోల్బణం ఉపశమించడం, ఉపాధి అవకాశాల విస్తృతి, అధిక వినియోగ వ్యయాలు ఇవన్నీ దీర్ఘకాల వృద్దికి మేలు చేస్తాయని తెలిపింది. ఈ అనుకూలతలు కొనసాగాలంటే ప్రైవేటు రంగం నుంచి మూలధన వ్యయాలు కీలకమని అభిప్రాయపడింది. విధానాలు, నియంత్రణ చర్యలతో ఈ అంతరాన్ని పూడ్చొచ్చని తెలిపింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత్‌కు సవాళ్లు విసురుతున్నప్పటికీ.. అంతర్జాతీయ వాణిజ్యం, తయారీలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. కొన్ని వస్తు, సేవల్లో భారత్‌కు ప్రత్యేక అనుకూలతలున్నట్టు గుర్తు చేసింది. వ్యూహాత్మకమైన వాణిజ్య చర్చలు, దేశీ సంస్కరణలు, తయారీపై పెట్టుబడులతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను అధిగమించొచ్చని వివరించింది. ‘అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఏర్పడుతున్న అనిశ్చితులు 2025–26లో వృద్ధి అంచనాలకు కీలక రిస్క్‌గా కనిపిస్తున్నాయి. కేవలం వాణిజ్యమే కాదు, దీర్ఘకాలం పాటు అనిశ్చితి ప్రైవేటు రంగ మూలధన ప్రణాళికలు నిలిచిపోయేందుకు దారితీయవచ్చు. ప్రైవేటు రంగం, విధాన నిర్ణేతలు ఈ రిస్క్‌ను దృష్టిలో పెట్టుకుని అనిశ్చితులను తొలగించుకునేందుకు వెంటనే కృషి చేయాల్సి ఉంది’ అని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది.
అవకాశాన్ని విడుచుకోరాదు..
పెట్టుబడులు–వృద్ధి–డిమాండ్ పెరుగుదల–అదనపు సామర్థ్యం ఏర్పాటు అనే పరస్పర ప్రయోజన సైకిల్‌కు మూలధన వ్యయాలు దారితీస్తాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ‘సాధారణ సమయాలతో పోల్చి చూస్తే ప్రస్తుతం కార్యాచరణ, నిర్వహణ ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఇదొక అవకాశం. దీన్ని కోల్పోరాదు’ అని తెలిపింది. పెట్టుబడుల కార్యకలాపాలు ఊపందుకున్నాయని.. ఇవి ఇంకా బలపడనున్నట్టు అంచనా వేసింది. ప్రైవేటు రంగ పెట్టుబడులకు నిధులు సమకూర్చేందుకు వీలుగా దేశీ పొదుపులు మెరుగుపడినట్టు పేర్కొంది. ఇక్కడి నుంచి జీడీపీలో ప్రభుత్వ రుణ భారాన్ని క్రమంగా తగ్గించుకోవడం ద్వారా ప్రైవేటు పెట్టుబడులకు అదనపు నిధులు లభించేలా చూడొచ్చని.. రాష్ట్రాలు సైతం తమ రుణ భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని సూచించింది.
వ్యవసాయ వృద్ధి ఆశావహం
వ్యవసాయరంగలో వృద్ధి అవకాశాలు ఆశావహంగా ఉన్నట్టు ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. రిజర్వాయర్లలో తగిన నీటి నిల్వలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాగు దిగుబడి బలంగా ఉంటుందని తెలిపింది. ఇది గ్రామీణ వినియోగాన్ని పెంచుతుందని.. పట్టణ డిమాండ్ స్థిరంగా మెరుగుపడుతున్నట్టు వివరించింది. తయారీ కార్యకలాపాలు కోలుకుంటున్నట్టు.. సేవల రంగం కార్యకలాపాలు సైతం బలంగా ఉన్నట్టు తెలిపింది. రానున్న సంవత్సరంలో ఉపాధి అవకాశాల పట్ల పలు సర్వేలు వెల్లడించిన సానుకూల అంచనాలను గుర్తు చేసింది.
ఇదీ చదవండి: ‘మనీ మహిమ’తోనే చాలామంది విడాకులు!
వస్తు ఎగుమతులకు సవాళ్లు..
అంతర్జాతీయ అనిశ్చితులతో ఎగుమతులు సవాళ్లు ఎదురుకావొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. సేవల ఎగుమతులు బలంగానే ఉంటాయని పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యంలో రిస్‌్కలను జాగ్రత్తగా గమనిస్తూ.. కొత్త మార్కెట్లలోకి అవాకాశాలను వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. భిన్నమైన ఉత్పత్తులు, నాణ్యతపై పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఇదంటూ ప్రైవేటు రంగానికి సూచించింది.