
అనిశ్చితి ఎఫెక్ట్
జూన్ త్రైమాసికంలో విలీనాలు, పీఈ ఒప్పందాలు 48 శాతం డౌన్
17 బిలియన్ డాలర్లకు పరిమితం
గ్రాంట్ థార్న్‌టన్ భారత్ నివేదిక
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగిపోతుండటం, పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో విలీనాలు, కొనుగోళ్లు (ఎంఅండ్‌ఏ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) డీల్స్‌పై ప్రభావం పడింది. లావాదేవీలు ఏకంగా 48 శాతం పడిపోయాయి. 17 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
పరిమాణంపరంగా 2025 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే రెండో త్రైమాసికంలో ఎంఅండ్‌ఏ, పీఈ డీల్స్ 13 శాతం క్షీణించి 582కి పరిమితమయ్యాయి. 2023 రెండో క్వార్టర్ తర్వాత త్రైమాసికాలవారీగా డీల్ విలువ ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమం. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్ భారత్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, అనిశ్చితి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న బంగారం ధరలు మొదలైన భౌగోళికరాజకీయాంశాల వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. అయితే, మందగమనంలోనూ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు నిలకడగా వస్తుండటం, కొత్త యూనికార్న్‌లు ఆవిర్భవిస్తుండటం మొదలైనవి సానుకూలాంశాలని గ్రాంట్ థార్న్‌టన్ భారత్ పార్ట్‌నర్ (గ్రోత్) శాంతి విజేత తెలిపారు. మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్‌లాంటి రంగాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి కనపరుస్తున్నారని వివరించారు.
నివేదికలో మరిన్ని విశేషాలు..
→ జూన్ త్రైమాసికంలో 5.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 197 ఎంఅండ్‌ఏ లావాదేవీలు నమోదయ్యాయి. 2023 క్యూ2 తర్వాత ఇది కనిష్ట స్థాయి. తాజా క్యూ2లో బిలియన్ డాలర్ డీల్ ఒకే ఒక్కటి (యస్ బ్యాంక్‌లో సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ 1.57 బిలియన్ డాలర్ల పెట్టుబడి) నమోదైంది. 2025 క్యూ1లో ఇలాంటి డీల్స్ నాలుగు ఉన్నాయి.
→ పీఈ కార్యకలాపాలు, గత త్రైమాసికంతో పోలిస్తే తగ్గినప్పటికీ 2022 నాలుగో త్రైమాసికం తర్వాత అత్యధిక స్థాయిలో 7.5 బిలియన్ డాలర్ల విలువ చేసే 357 డీల్స్ నమోదయ్యాయి.
→ క్యూ2లో పబ్లిక్ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణ పెద్దగా జరగలేదు. వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఐపీవో కార్యకలాపాలు నెమ్మదించాయి. జూన్ త్రైమాసికంలో కంపెనీలు 12 ఐపీవోల ద్వారా 1.9 బిలియన్ డాలర్లు సమీకరించాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే డీల్స్ పరిమాణం 25 శాతం, విలువ 26 శాతం తగ్గింది.
→ అయితే, జూన్‌లో పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్న సంకేతాలు కనిపించాయి. నెలలవారీగా చూస్తే, ఈ ఏడాది మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ఐపీవోలు, నిధుల సమీకరణ విషయంలో జూన్ రెండో స్థానంలో నిల్చింది. లీలా హోటల్స్ (407 మిలియన్ డాలర్లు), ఏథర్ ఎనర్జీ (343 మిలియన్ డాలర్లు), ఏజిస్ వొప్యాక్ టెరి్మనల్స్ (326 మిలియన్ డాలర్లు) లాంటి పెద్ద లిస్టింగ్‌లు నమోదయ్యాయి.
→ దాదాపు క్రితం త్రైమాసికం తరహాలోనే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్‌కి (క్యూఐపీ) సంబంధించి 2.2 బిలియన్ డాలర్ల విలువ చేసే 16 ఇష్యూలు నమోదయ్యాయి.