breaking news
Grant Thornton International Business Report (IBR)
-
డీల్స్ డీలా
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగిపోతుండటం, పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో విలీనాలు, కొనుగోళ్లు (ఎంఅండ్ఏ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) డీల్స్‌పై ప్రభావం పడింది. లావాదేవీలు ఏకంగా 48 శాతం పడిపోయాయి. 17 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. పరిమాణంపరంగా 2025 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే రెండో త్రైమాసికంలో ఎంఅండ్ఏ, పీఈ డీల్స్ 13 శాతం క్షీణించి 582కి పరిమితమయ్యాయి. 2023 రెండో క్వార్టర్ తర్వాత త్రైమాసికాలవారీగా డీల్ విలువ ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమం. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ భారత్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, అనిశ్చితి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న బంగారం ధరలు మొదలైన భౌగోళికరాజకీయాంశాల వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. అయితే, మందగమనంలోనూ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు నిలకడగా వస్తుండటం, కొత్త యూనికార్న్‌లు ఆవిర్భవిస్తుండటం మొదలైనవి సానుకూలాంశాలని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ (గ్రోత్) శాంతి విజేత తెలిపారు. మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్‌లాంటి రంగాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి కనపరుస్తున్నారని వివరించారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → జూన్ త్రైమాసికంలో 5.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 197 ఎంఅండ్ఏ లావాదేవీలు నమోదయ్యాయి. 2023 క్యూ2 తర్వాత ఇది కనిష్ట స్థాయి. తాజా క్యూ2లో బిలియన్ డాలర్ డీల్ ఒకే ఒక్కటి (యస్ బ్యాంక్‌లో సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ 1.57 బిలియన్ డాలర్ల పెట్టుబడి) నమోదైంది. 2025 క్యూ1లో ఇలాంటి డీల్స్ నాలుగు ఉన్నాయి. → పీఈ కార్యకలాపాలు, గత త్రైమాసికంతో పోలిస్తే తగ్గినప్పటికీ 2022 నాలుగో త్రైమాసికం తర్వాత అత్యధిక స్థాయిలో 7.5 బిలియన్ డాలర్ల విలువ చేసే 357 డీల్స్ నమోదయ్యాయి. → క్యూ2లో పబ్లిక్ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణ పెద్దగా జరగలేదు. వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఐపీవో కార్యకలాపాలు నెమ్మదించాయి. జూన్ త్రైమాసికంలో కంపెనీలు 12 ఐపీవోల ద్వారా 1.9 బిలియన్ డాలర్లు సమీకరించాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే డీల్స్ పరిమాణం 25 శాతం, విలువ 26 శాతం తగ్గింది. → అయితే, జూన్‌లో పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్న సంకేతాలు కనిపించాయి. నెలలవారీగా చూస్తే, ఈ ఏడాది మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ఐపీవోలు, నిధుల సమీకరణ విషయంలో జూన్ రెండో స్థానంలో నిల్చింది. లీలా హోటల్స్ (407 మిలియన్ డాలర్లు), ఏథర్ ఎనర్జీ (343 మిలియన్ డాలర్లు), ఏజిస్ వొప్యాక్ టెరి్మనల్స్ (326 మిలియన్ డాలర్లు) లాంటి పెద్ద లిస్టింగ్‌లు నమోదయ్యాయి. → దాదాపు క్రితం త్రైమాసికం తరహాలోనే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్‌కి (క్యూఐపీ) సంబంధించి 2.2 బిలియన్ డాలర్ల విలువ చేసే 16 ఇష్యూలు నమోదయ్యాయి. -
IBR Report: మధ్యస్థాయి వ్యాపారాల్లో మహిళా సారథులు
ముంబై: దేశంలో మధ్యస్థాయి వ్యాపారాలకు సంబంధించి సీనియర్ మేనేజ్మెంట్ బాధ్యతలను 36 శాతం మేర మహిళలే నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇది సగటున 32 శాతం ఉంటే, మన దేశం ఈ విషయంలో మెరుగ్గా కనిపిస్తోంది. ‘వుమెన్ ఇన్ బిజినెస్ 2023– ద పుష్ ఫర్ ప్యారిటీ’ పేరుతో గ్రాంట్ థార్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఓ నివేదికను విడుదల చేసింది. ఇక అంతర్జాతీయంగా 9 శాతం మధ్యస్థాయి కంపెనీల్లో నాయకత్వ స్థాయి పోస్టుల్లో మహిళలకు ప్రాతినిధ్యమే లేకపోవడం గమనార్హం. ‘‘కార్యాలయాల్లో లింగ సమానత్వం కోసం ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాం. ఈ విధమైన పురోగతి ఎంతో ఉత్సాహానిస్తుంది. మరింత మెరుగైన సమానత్వం కోసం సంస్థలు హైబ్రిడ్ లేదా సులభ విధానాలను అమలు చేయాలి. మద్దతునిచ్చే, అర్థం చేసుకునే సంస్కృతి ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల శ్రేయస్సు, వారి మార్గదర్శకత్వంపై దృష్టి సారించాలి. అప్పుడు మహిళలకు మద్దతుగా నిలిచినట్టు అవుతుంది’’అని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ పల్లవి బఖ్రు పేర్కొన్నారు. సీనియర్ స్థాయి ఉద్యోగాల్లో వైవిధ్యాన్ని పెంచడం బాధ్యాతయుతమైన చర్యే కాదని, వాణిజ్యపరంగా పనితీరు మెరుగుపడడానికి దోహదం చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో 10,000 సంస్థల ప్రతినిధులను ఈ నివేదిక కోసం గ్రాంట్ థార్న్టన్ ఇంటర్వ్యూ, సర్వే చేసింది. కంపెనీల ఎండీలు, సీఈవోలు, నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో ఉన్న వారి అభిప్రాయాలు తెలుసుకుంది. భారత్‌లో 281 కంపెనీల నుంచి సమాచారం సేకరించింది. మధ్యస్థాయి వ్యాపార సంస్థల్లో నాయకత్వ, సీనియర్ స్థానాల విషయంలో బ్రిక్ దేశాల్లో మహిళల శాతం 34గా ఉంటే, జీ7 దేశాలలో 30 శాతంగా ఉంది. -
ఆగస్ట్‌లో డీల్స్ జూమ్
ముంబై: గత నెల(ఆగస్ట్)లో దేశీ కార్పొరేట్ ప్రపంచంలో డీల్స్ భారీగా ఎగశాయి. మొత్తం 219 డీల్స్ జరిగాయి. 2005 తదుపరి ఇవి అత్యధికంకాగా.. 2020 ఆగస్ట్‌తో పోల్చినా రెట్టింపయ్యాయి. వీటి విలువ 8.4 బిలియన్ డాలర్లు. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ అందించిన వివరాలివి. అయితే ఈ(2021) జులైతో పోలిస్తే లావాదేవీలు పరిమాణంలో 21 శాతం ఎగసినప్పటికీ విలువలో 36 శాతం క్షీణించాయి. ఇందుకు విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) విభాగంలో యాక్టివిటీ ఆరు రెట్లు పడిపోవడం కారణమైంది. ఆగస్ట్‌లో ప్రధానంగా ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారానే అత్యధిక డీల్స్ నమోదయ్యాయి. 182 లావాదేవీల ద్వారా 7.6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. దేశీ కంపెనీలు, యూనికార్న్(స్టార్టప్‌లు) ఇందుకు వేదికయ్యాయి. లాభదాయక అవకాశాలు, ఆర్థిక రికవరీపై విశ్వాసం, పరిశ్రమల స్థాపనలో నైపుణ్యం వంటి అంశాలు ప్రభావం చూపాయి. యూనికార్న్‌ల స్పీడ్ పారిశ్రామిక పురోగతి, బలపడుతున్న డిమాండ్, ఆర్థిక రికవరీ నేపథ్యంలో ఇకపై సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశమున్నట్లు గ్రాంట్ థార్న్టన్ నిపుణులు శాంతి విజేత పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లు, విధానాల మద్దతు, ప్రపంచ దేశాల పురోభివృద్ధి ఇందుకు మద్దతుగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎంఅండ్ఏ విభాగంలో 86.7 కోట్ల డాలర్ల విలువైన 37 డీల్స్ జరిగాయి. 2020 ఆగస్ట్‌లో 90.8 కోట్ల డాలర్ల విలువైన 30 లావాదేవీలు నమోదయ్యాయి. టెక్, ఎడ్యుకేషన్, ఫార్మా, ఎనర్జీ రంగాలలో అధిక డీల్స్ జరిగాయి. గత నెలలో ఏడు స్టార్టప్‌లో యూనికార్న్ హోదాను అందుకున్నాయి. బిలియన్ డాలర్ల విలువను సాధించిన స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టార్టప్ వ్యవస్థ 115 డీల్స్ ద్వారా 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకుంది. -
అవుట్ సోర్సింగ్‌పై ఆందోళన
ఆచి, తూచి వ్యవహరిస్తున్న అంతర్జాతీయ కంపెనీలు గ్రాంట్థార్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ సర్వే న్యూఢిల్లీ: అవుట్ సోర్సింగ్ పట్ల ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని గ్రాంట్ థార్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్(ఐబీఆర్) తాజా సర్వే వెల్లడించింది. తమ కార్యకలాపాలను అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వాలన్న తక్షణ ప్రణాళికలు ఏమీ లేవని ప్రపంచవ్యాప్తంగా 60 శాతం కంపెనీలు భావిస్తున్నాయని ఈ సర్వే పేర్కొంది. ఫలితంగా దేశీయంగా ఉద్యోగాల కోత ఉండే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతోందని వివరించింది. 45 దేశాల్లో మొత్తం 3,300 కంపెనీలపై ఈ సర్వేను నిర్వహించారు. అవుట్ సోర్సింగ్ వల్ల కీలకమైన విభాగంపై నియంత్రణ కోల్పోతామోనన్న ఆందోళన అంతర్జాతీయ కంపెనీల్లో పెరిగిపోతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.