IBR Report: మధ్యస్థాయి వ్యాపారాల్లో మహిళా సారథులు

IBR Report: 36percent of senior positions in India mid-market held by women - Sakshi

36 శాతం పోస్టుల్లో మహిళలే

అంతర్జాతీయంగా ఇది 32 శాతమే

గ్రాంట్‌ థార్న్‌టన్‌ నివేదిక వెల్లడి

ముంబై: దేశంలో మధ్యస్థాయి వ్యాపారాలకు సంబంధించి సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను 36 శాతం మేర మహిళలే నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇది సగటున 32 శాతం ఉంటే, మన దేశం ఈ విషయంలో మెరుగ్గా కనిపిస్తోంది. ‘వుమెన్‌ ఇన్‌ బిజినెస్‌ 2023– ద పుష్‌ ఫర్‌ ప్యారిటీ’ పేరుతో గ్రాంట్‌ థార్న్‌టన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ ఓ నివేదికను విడుదల చేసింది. ఇక అంతర్జాతీయంగా 9 శాతం మధ్యస్థాయి కంపెనీల్లో నాయకత్వ స్థాయి పోస్టుల్లో మహిళలకు ప్రాతినిధ్యమే లేకపోవడం గమనార్హం.

‘‘కార్యాలయాల్లో లింగ సమానత్వం కోసం ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాం. ఈ విధమైన పురోగతి ఎంతో ఉత్సాహానిస్తుంది. మరింత మెరుగైన సమానత్వం కోసం సంస్థలు హైబ్రిడ్‌ లేదా సులభ విధానాలను అమలు చేయాలి. మద్దతునిచ్చే, అర్థం చేసుకునే సంస్కృతి ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల శ్రేయస్సు, వారి మార్గదర్శకత్వంపై దృష్టి సారించాలి. అప్పుడు మహిళలకు మద్దతుగా నిలిచినట్టు అవుతుంది’’అని గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్‌ పార్ట్‌నర్‌ పల్లవి బఖ్రు పేర్కొన్నారు.

సీనియర్‌ స్థాయి ఉద్యోగాల్లో వైవిధ్యాన్ని పెంచడం బాధ్యాతయుతమైన చర్యే కాదని, వాణిజ్యపరంగా పనితీరు మెరుగుపడడానికి దోహదం చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో 10,000 సంస్థల ప్రతినిధులను ఈ నివేదిక కోసం గ్రాంట్‌ థార్న్‌టన్‌ ఇంటర్వ్యూ, సర్వే చేసింది. కంపెనీల ఎండీలు, సీఈవోలు, నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో ఉన్న వారి అభిప్రాయాలు తెలుసుకుంది. భారత్‌లో 281 కంపెనీల నుంచి సమాచారం సేకరించింది. మధ్యస్థాయి వ్యాపార సంస్థల్లో నాయకత్వ, సీనియర్‌ స్థానాల విషయంలో బ్రిక్‌ దేశాల్లో మహిళల శాతం 34గా ఉంటే, జీ7 దేశాలలో 30 శాతంగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top