
'భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయింది' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచలంగా మారింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమేనా?, భారతదేశ ఆర్ధిక వ్యవస్థ నిజంగా చనిపోయిందా అని తెలుసుకోవడానికి.. అమెరికా సృష్టించిన ఐదు ప్రధానమైన ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ప్రశ్నిస్తే.. ఎలాంటి సమాధానం ఇచ్చాయో ఈ కథనంలో చూసేద్దాం.
ప్రశ్న: భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయిందా?
చాట్‌జీపీటీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా చనిపోలేదు. ఇది డైనమిక్, ఎంతో ప్రతిష్టాత్మకమైనదని చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది.
గ్రోక్: భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని గ్రోక్ పేర్కొంది.
జెమిని: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని సాధిస్తోందని గూగుల్ జెమిని స్పష్టం చేసింది.
మెటా ఏఐ: భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటని చెప్పింది.
కోపైలెట్: భారతదేశ ఆర్ధిక వ్యవస్థ డెడ్ ఎకానమీ కాదు, ఇది పూర్తిగా వ్యతిరేకం అని కోపైలెట్ వెల్లడించింది.
ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలు
భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ఒకవైపు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర పేరున్న సంస్థలు కీర్తిస్తుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ (నిర్వీర్యమైనది)గా అభివర్ణిస్తూ నోరు పారేసుకున్నారు. కాకపోతే ఈ వ్యాఖ్యలు తప్పుగా ఉచ్చరించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు భారత్ ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉండడమే కాకుండా.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు క్యూ కడుతుండడాన్ని గుర్తు చేశారు.
ఇండియానే ఆధారం
''ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ సౌత్ ప్రధానంగా మారుతోంది. ఇందులో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. మరోవైపు అభివృద్ధి చెందిన ఒకప్పటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. భారత సంతతి వారి కృషి మూలంగానే ఆయా ఆర్థిక వ్యవస్థలు ఎంతో కొంత సానుకూల వృద్ధిని చూపించగలుగుతున్నాయి'' అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారుడు డీకే శ్రీవాస్తవ తెలిపారు. అధిక యువ జనాభా కలిగిన భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో చురుకైన, చైతన్యవంతమైనదిగా పేర్కొన్నారు.