
ఉద్రిక్తతలు నివారించుకుందాం
పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ విజ్ఞప్తి
ఇస్లామాబాద్: భారత్‌తో పూర్తిస్థాయి యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ బుధవారం చెప్పారు. పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భారత్–పాక్ మధ్య మొదలైన ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయని, అది తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. పరిస్థితి మారిపోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
ఉద్రిక్తతలు నివారించుకుందామని భారత్‌కు విజ్ఞప్తి చేశారు. భారత్‌తో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. భారత్ వెనక్కి తగ్గితే తాము సైతం వెనక్కి తగ్గి ఉంటామని సూచించారు. యుద్ధం ఇంకా కొనసాగడం మనకు మేలు చేయదని చెప్పారు. భారత్ మొండిగా ముందుకెళ్తే యుద్ధం చేయడం తప్ప తమకు మరో మార్గ లేదని ఖవాజా అసిఫ్ స్పష్టంచేశారు. ఆయుధాలు వదిలేసి భారత్‌కు లొంగిపోలేం కదా? అని వ్యాఖ్యానించారు.