
తీరికూర్చుని భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో జగడాలమారి పాకిస్తాన్‌కూ, దాని కీలుబొమ్మలైన ఉగ్రమూకలకూ తెలిసొచ్చి ఉండాలి. 2016 నాటి ‘ఉరి’ సర్జికల్ దాడులు, 2019 నాటి బాలాకోట్ వైమానిక దాడులకు అనేక రెట్లు అధికంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ‘ఆపరేషన్ సిందూర్’ సంకేతనామంతో మన త్రివిధ దళాలు పకడ్బందీ సమన్వయంతో పాకిస్తాన్‌లోనూ, ఆక్రమిత కశ్మీర్ లోనూ తొమ్మిది చోట్ల గంటసేపు సాగించిన క్షిపణి దాడులు పాక్ సైన్యాన్నీ, ఉగ్రమూకల్నీ గుక్క తిప్పుకోనీయకుండా చేశాయి.
ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలూ, వారి ఆయుధ గిడ్డంగులూ, ఇతరేతర అవసరాలకు వినియోగిస్తున్న బహుళ అంతస్తుల భవంతులూ లక్ష్యంగా మొత్తం 24 చోట్ల సాగించిన దాడుల్లో 70 మంది వరకూ ఉగ్రవాదులు మరణించగా, మరో 60 మంది గాయపడ్డారని చెబు తున్నారు. ఉగ్రవాద ముఠాలైన జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) ప్రధాన కార్యాలయాలు రెండూ కుప్పకూలాయని సమాచారం. జేఈఎం చీఫ్ మసూర్ అజర్ సోదరితోసహా అతగాడి కుటుంబానికి చెందిన పదిమంది హతమయ్యారని కూడా చెబుతున్నారు. జరిగిన నష్టాన్ని కప్పెట్టే ఎత్తుగడతో అయిదు భారత్ విమానాలను కూల్చామంటూ పాక్ స్వోత్కర్షలకు పోతోంది.
సంప్రదాయానికి భిన్నంగా ఈసారి పాక్ లోలోపలివరకూ చొచ్చుకెళ్లి దాడులు సాగించిన తీరూ, ఒక్క క్షిపణి కూడా గురితప్పకుండా శత్రుమూకలపై చండ్రనిప్పులు కురిపించిన విధానం మన త్రివిధ దళాల పకడ్బందీ అంచనాలకూ, పదునైన వ్యూహచతురతకూ దర్పణాలు. పాక్ గడ్డపై గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఉగ్రశిబిరాల ఆనుపానుల్ని శత్రునేత్రానికి చిక్కని విధంగా గత పక్షం రోజులుగా మానవ రహిత విమానాలతో జల్లెడపట్టాకే ఈ దాడులు జరిగాయి.
పహల్‌గామ్ సమీపంలో అకారణంగా, అన్యాయంగా నిరాయుధ భారత పౌరులను గురిచూసి కాల్చిచంపటానికి కిరాయిమూకల్ని పంపి కొన్నిరోజులుగా పాకిస్తాన్ మురుస్తోంది. దీనిపై నిలదీస్తే షరా మామూ లుగా సాక్ష్యాలడుగుతోంది. గత నెల 22న పహల్‌గామ్ సమీపంలో ఉగ్రవాద ముఠా 26 మందిని పొట్టనబెట్టుకున్నప్పటి నుంచీ భారత ప్రజ ప్రతీకారంతో రగిలిపోతోంది. కంటికి కన్ను సిద్ధాంతం పాటించి గట్టి దెబ్బతీయాల్సిందేనన్న అభిప్రాయం అలుముకుంది. ఈ నేపథ్యంలో మన దళాల దాడులు విజయవంతం కావటం అందరినీ సాంత్వన పరుస్తుందనటంలో సందేహం లేదు.
అనుకోని పరిణామాలు తలెత్తితే అనుసరించాల్సిన పద్ధతులపై పౌరులకు అవగాహన కల్పించటానికి బుధవారం మాక్ డ్రిల్ జరగటం, అంతకుముందు రోజు రాత్రే మన త్రివిధ దళాలు దాడులు చేయటం గమనిస్తే వర్తమానం ఎంత జటిలంగా ఉన్నదో అర్థమవుతుంది. ఇది మనం కోరుకున్నది కాదు. మన ప్రమేయం లేకుండా వచ్చిపడిన విపత్తు. అకారణంగా మనపై రుద్దిన సంక్లిష్ట సమస్య. దీనికి దీటుగా స్పందించకపోతే ఉగ్రదాడులకు అంతూ పొంతూ ఉండదు. కనుకనే పహల్‌గామ్ మారణకాండ గురించి తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటనను రద్దుచేసుకుని వెను దిరిగారు.
ఆ వెంటనే మంత్రివర్గ సహచరులతో, త్రివిధ దళాల అధిపతులతో వరస సమాలోచనలు సాగించారు. ఎప్పుడు, ఎక్కడ ఎలా దాడులు సాగించాలో, తీవ్రత ఏ స్థాయిలో వుండాలో మీరే నిర్ణ యించండంటూ మన దళాలకు అధికారం ఇచ్చారు. పర్యవసానంగానే పాక్ ప్రాపకంతో చెలరేగి పోతున్న ఉగ్రముఠాలకు గట్టి సమాధానం వెళ్లింది. ఈ దాడులకు చాలాముందే ఇతరేతర నిర్ణ యాలు తీసుకున్నారు. సింధూ నదీజలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించ టంతోపాటు ఇండియా పలు చర్యలు తీసుకుంది. దీన్నంతటినీ గమనిస్తున్నవారికి మన దేశం సైనిక చర్యకు కూడా వెనకాడబోదని పక్షం రోజుల క్రితమే అర్థమైంది.
యుద్ధం దేనికీ పరిష్కారం కాకపోవచ్చు. చర్చలే అంతిమంగా ఎంతటి జటిల సమస్యనైనా పరిష్కరిస్తాయన్న సిద్ధాంతం కూడా సరైనదే కావొచ్చు. కానీ పొరుగు పచ్చగావుంటే ఓర్వలేక నిష్కారణంగా దాడులకు దిగే నైజాన్ని శాంతిప్రవచనాలతో ఎదుర్కొనటం సాధ్యమేనా? ఒకపక్క పహల్‌గామ్ దాడులతో సంబంధం లేదంటూనే గత కొన్ని రోజులుగా అధీనరేఖ వద్దా, అంత ర్జాతీయ సరిహద్దు వద్దా పాక్ ఎలాంటి కవ్వింపూ లేకుండా కాల్పులకు దిగుతోంది. ఈ దాడుల కారణంగా ఒక్క బుధవారంనాడే పూంఛ్ జిల్లా గ్రామాల్లో 12 మంది పౌరులు బలయ్యారు.
తన దుష్ట పన్నాగాలను కప్పిపుచ్చటానికి భద్రతామండలిలో పాకిస్తాన్ అమాయకత్వం నటిస్తూ భారత్ తీసు కుంటున్న వరస చర్యలకు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలని విఫలయత్నం చేసింది. రేపో మాపో అది నేరుగా సైన్యాన్ని రంగంలోకి దించి ప్రతీకారం పేరిట చెలరేగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉగ్రముఠాల ద్వారా మారణహోమానికి పాల్పడటం కన్నా ఒకరకంగా ఇది మంచిదే. భారత్ బెదిరిపోయి సైనిక దాడుల ఆలోచన మానుకుంటుందన్న తప్పుడు ఆలోచనతో కొన్ని రోజులుగా అది అణుబాంబు బెదిరింపులకు కూడా తెగించింది.
ఆ దుస్సాహసానికి పూనుకుంటే చేజేతులా స్వీయవినాశనాన్ని కొనితెచ్చుకున్నానని పాక్ పశ్చాత్తాపపడే రోజు ఎంతో దూరంలో ఉండదు. ఈ కష్టకాలంలో దేశ ప్రజానీకం కుల మత భేదాలు మరిచి కలిసికట్టుగా ఉండటం అత్య వసరం. ఇదే అదనుగా నాలుగు ఓట్ల కోసమో, మరికొన్ని సీట్ల కోసమో ప్రజల్లో వైషమ్యాలు సృష్టించాలని చూసే అవాంఛనీయ శక్తుల్ని అందరూ సకాలంలో పోల్చుకుని దూరం పెట్టడం, తగిన బుద్ధి చెప్పటం ఎంతో అవసరం. మనలోని సమష్టితత్వమే ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనే ధైర్యాన్ని స్తుంది. విజయాన్ని మన చేతికందిస్తుంది.