నూతన ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజే కేంద్ర మంత్రిమండలి భేటీ అయ్యి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. కొత్త ప్రభుత్వంలో తొలి మంత్రిమండలి సమావేశం కావడంతో భేటీపై మొదటి నుంచి ఉత్కంఠ నెలకొంది. దానికి అనుగుణంగానే కొన్ని కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుంది. దేశ రక్షణ నిధి నుంచి అమరులైన సైనికుల పిల్లలకు ఇచ్చే ఉపకారవేతనాలను పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు రెండువేల నుంచి 2500కు, విద్యార్థినులకు 2250 నుంచి 3వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర పారామిలటరీ బలగాలతో పాటు, రాష్ట్రంలో అమలు అయ్యే పోలీసు కుటుంబాలకు కూడా ఈపథకాన్ని వర్తించే విధంగా రూపకల్పన చేశారు. ఏడాదికి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన వారి నుంచి ఇకపై ఎంపిక చేయనున్నారు.