‘‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం. ప్రత్యేక హోదాను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. ప్రత్యేక హోదా భరోసా యాత్ర చిత్తూరు జిల్లా తిరుపతికి చేరుకున్న సందర్భంగా తారకరామ స్టేడియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో హామీలిచ్చారని, ఒక్కటి కూడా అమలు చేయలేదని, అవన్నీ అబద్ధపు హామీలేనని మండిపడ్డారు. మంచిరోజులు తీసుకొస్తానని చెప్పి రాఫెల్ యుద్ధ విమానాల్లో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టారని దుయ్యబట్టారు. ప్రధానమంత్రిని కాదు, కాపలాదారుడినని చెప్పుకుంటూ చివరకు దొంగయ్యాడని మోదీపై నిప్పులు చెరిగారు. ఇచ్చిన మాటపై నిలబడడం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకతన్నారు.