నరాలుతెగే ఉత్కంఠకు రేపు తెరపడనుంది. మరో 24 గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఓటరు తన మనోభీష్టాన్ని దాచిన ఈవీఎంలు మంగళవారం తెరుచుకోనున్నాయి. విజయంపై అన్ని పార్టీలు బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల అందరిలో టెన్షన్ నెలకొంది. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్య ర్థులతో పాటు కార్యకర్తలకు ఈ 24 గంటలు క్షణమొక యుగంలా మారాయి. గత శాసనసభ ఎన్నికల్లో 69.5% మాత్రమే పోలింగ్ జరగగా, ఈసారి రికార్డు స్థాయిలో 73.2 శాతానికి పోలింగ్ పెరగడంపై సరైన అంచనాలు అంద డం లేదు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించేందుకు 44 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కౌటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు జరగనున్న ఒక రౌండ్‌లో ఒకేసారి 14 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కలు తేలనున్నాయి. ప్రతి టేబుల్ వద్ద ఓ పర్యవేక్షకుడు, ఓ సహాయ పర్యవేక్షకుడు, ఓ సూక్ష్మ పరిశీలకుడిని నియమిం చనున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి మొదటి దఫా శిక్షణ ఇవ్వగా.. సోమవారం రెండో విడత శిక్షణ ఇస్తారు. అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఒక కౌటింగ్ ఏజెంట్‌ను లెక్కింపు కేంద్రంలోపలకు అనుమతించనున్నారు.