దయచేసి ఎవరూ ఇలా చేయకండి

చెన్నై: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. లాటరీ విషయంలో మోసపోయిన ఓ కుటుంబం గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. తమ చావుకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ఓ వీడియో తీసిమరీ తనువు చాలించారు. తమిళనాడులోని విల్లుపురంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలు.. సితేరికరై ప్రాంతంలో నివసిస్తున్న అరుణ్‌(33) వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాజాగా వ్యాపారంలో నష్టం రావడంతో అధిక సొమ్ము వెచ్చించి.. అక్రమంగా నిర్వహిస్తున్న లాటరీకి సంబంధించిన టికెట్లు కొనుగోలు చేశాడు. కాగా లాటరీ విషయంలో కూడా మోసపోవడంతో చివరికి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా తమ ముగ్గురు పిల్లలకు సైనేడ్‌ ఇచ్చి... అనంతరం భార్య, భర్తలిద్దరూ కూడా చనిపోయారు.  చనిపోయే ముందు అరుణ్‌ తీసిన వీడియో అందరిని కంటతడి పెట్టిస్తోంది. 

వీడియోలో..  ‘‘లాటరీ టిక్కెట్లు కొనడం వల్ల అప్పులపాలయ్యాను. సమాజంలో న్యాయం, చట్టం ఏవీ లేవు. నా ముగ్గురు పిల్లలకు విష గుళికలు ఇచ్చాను. నా కూతుళ్లు నా కళ్ల ఎదుటే చనిపోయారు. కాసేపట్లో మేము కూడా విషం తీసుకోనున్నాం. మేము బతికి ఉండాలని కోరుకోవడం లేదు. మాకోసం ఎవరూ ఏం చేయకండి. మేము ఎవరికి భారం కావాలని అనుకోవడం లేదు. మీరైనా సంతోషంగా జీవించండి. మాలాగా అవ్వకండి. అలాగే  అక్రమంగా జరిగే లాటరీ అమ్మకాలను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలా చేయడం వల్ల మాలాంటి అనేక మంది ఇలాంటి అప్పుల బాధ నుంచి తప్పించుకోగలరు’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. 

ఈ వీడియోను చనిపోయే కొన్ని క్షణాల ముందు తన స్నేహితులకు వాట్సాప్‌ చేయగా.. వీడియో చూసిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలోపు కుటుంబంలోని అయిదుగురు (అరుణ్‌, భార్య శివగామి, కూతుళ్లు.. ప్రియదర్శిని, యువశ్రీ, భారతి)  అప్పటికే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులను పోలీసులు విచారించగా అరుణ్‌కు దాదాపు రూ. 30 లక్షల వరకు అప్పులు ఉన్నాయని తేలింది. ఇక వీరి మరణంతో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ లాటరీ అమ్మకాల విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఏడాది రాష్ట్రంలో 200 కంటే ఎక్కువ  అక్రమ లాటరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top