మార్కెట్ యార్డులకూ ‘నాడు–నేడు’ పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. కొన్ని రైతు బజార్లలో రైతులు కాని వారు అమ్మకాలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నందున నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 56 రైతు బజార్లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన చోట్ల వేరుశనగ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, చిరుధాన్యాల శుద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిరుధాన్యాల సాగు ఖర్చు పరిగణనలోకి తీసుకుని గిట్టుబాటు అయ్యేలా తక్షణమే కొనుగోలు ధర నిర్ణయించాలన్నారు. టమాటా ధర పడిపోకుండా మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసి ధరలు స్థిరీకరించాలని చెప్పారు. గోడౌన్ల నిర్మాణంపై నియోజకవర్గాలు, మండలాల వారీగా మ్యాపింగ్ చేయాలని సూచించారు. చీనీ రైతులకు మంచి ధర వచ్చేలా అనుసరించాల్సిన మార్కెటింగ్ వ్యూహాలపైనా చర్చించారు. పత్తి కొనుగోళ్లపై ఆరా తీశారు.