‘అక్కడ శవాలు పడున్నాయి’

జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరుగుతుండగా తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌  మీడియాలో వైరలవుతోంది. సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన ఈ వీడియో దాడి జరిగిన ప్రాంతంలోని భయానక పరిస్థితులను, నష్టాన్ని కళ్లకు కడుతుంది. వీడియోలో ‘చంపేశాడు, చంపేశాడు.. అక్కడ శవాలు పడి ఉన్నాయనే’ మాటలు వినిపిస్తున్నాయి.బహుశా వీడియో తీసిన వ్యక్తి దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నాడని.. ప్రత్యక్షంగా చూసి ఉండవచ్చని భావిస్తున్నారు నెటిజన్లు. సెల్‌ఫోన్‌లో తీసిన ఈ వీడియోలో పేలుడు జరిగిన ప్రాంతం, చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు, తుక్కుతుక్కయిన వాహనాలు దాడి తీవ్రతను తెలియజేస్తున్నాయి. కాగా, ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ ప్రకటించుకుంది. తమ కమాండర్‌ ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ అలియాస్‌ వకాస్‌ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సహా పలువురు నేతలు ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top