సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నడుస్తున్న సమస్యలు.. సినిమాలపై కొందరు ప్రదర్శిస్తున్న తీరులను ఎండగడుతూనే ఆయన ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘దేశానికి మంచి నాయకుడు కావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీని పీఎంగా ఎన్నుకున్నాం. కానీ, మీ వ్యవహారశైలి చూస్తుంటే, మీరు కొంత మందికి మాత్రమే ప్రధాన మంత్రి అనే ఫీలింగ్ కలుగుతోంది. మీరు అలాంటివారు కాదనేది గట్టి నమ్మకం. ఈ మధ్య కాలంలో సినిమాలపై ప్రతి ఒక్కరూ పడిపోతున్నారు. ముఖ్యంగా బీజేపీవాళ్లు. 'ఉడ్తా పంజాబ్', 'మెర్సల్', 'పద్మావతి'... ఇలా ఎన్నో సినిమాలపై దాడులు జరుగుతున్నాయి. సినిమా అనే క్రియేటివిటీని ఆపడానికి చేసే ప్రయత్నం, భావ ప్రకటన స్వేచ్ఛను ఆపే ప్రయత్నం జరుగుతుంటే, మీరూ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. ఈ మౌనం సమర్థిస్తున్నట్టుగానే కనిపిస్తోంది అని తమ్మారెడ్డి అన్నారు.