గత 16 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలపై వాహనదారులకు చుక్కలు చూపించిన ఆయిల్ కంపెనీలు నేడు జనానికి సర్‌ప్రైజ్ ఇచ్చాయి. వాహనదారులకు ఊరట కల్పిస్తున్నామని.. పెట్రోల్ ధరలను 60 పైసలు, డీజిల్ ధరలపై 56 పైసలు తగ్గించామంటూ ప్రకటనలు ఇచ్చాయి. హమ్మయ్య.. కాస్తో కూస్తో ధరలు తగ్గాయి కదా..! అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనూహ్యంగా మరో ప్రకటన చేసింది. రెండు మూడు గంటల వ్యవధిలోనే తగ్గింది 60 పైసలు కాదు.. కేవలం 1 పైసా మాత్రమే తగ్గించామంటూ సవరణ ప్రకటన వెలువరించి జనంతో జోకులు చేసింది. పెట్రోల్, డీజిల్ విక్రయించే ధరలను పోస్టు చేసే తమ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య నెలకొందని, పెట్రోల్, డీజిల్ ధరలను పునఃసమీక్షిస్తున్నామంటూ ప్రకటించింది. ఇంధన ధరల తగ్గింపు స్వల్పమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది.