కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ 88 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లికొడుకు అయ్యారు. ఒకప్పటి సహచరి అయిన ఉజ్వలా శర్మను ఆయన గురువారం ఉదయం లక్నోలో వివాహమాడారు. ఢిల్లీకి చెందిన మాజీ ప్రొఫెసర్ అయిన ఉజ్వలా శర్మకు తివారీ ద్వారా గతంలో రోహిత్ శేఖర్ అనే ఓ కుమారుడు జన్మించగా.. కోర్టులో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాతే ఆయన ఇటీవల 32 ఏళ్ల రోహిత్ శేఖర్ను తన కుమారుడిగా అంగీకరించిన విషయం తెలిసిందే. వివాహ వేడుక అనంతరం ఉజ్వలా శర్మ విలేకర్లతో మాట్లాడుతూ తివారీ వివాహ ప్రతిపాదన తెచ్చారని, ఈ వేడుక కొద్దిమంది సమక్షంలో జరిగిందన్నారు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. వివాహ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. 1967లో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న తివారీ, కృష్ణమెనన్ మార్గ్‌లో ఉన్న అప్పటి కేంద్రమంత్రి షేర్ సింగ్ ఇంటికి తరచూ వెళుతుండేవాడు. ఆ తరుణంలో షేర్ సింగ్ కూతురు ఉజ్వలకు తివారీతో ఏర్పడిన సన్నిహిత సంబంధం వారి కుమారుడు రోహిత్ శంకర్ పుట్టుకకు దారితీసింది. 2008లో రోహిత్ తనను కొడుకుగా గుర్తించాలని తివారీపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో దావా వేశాడు. అయితే తివారీ మాత్రం తను రోహిత్ తండ్రినన్న అభివాదాన్ని ఖండించటమే కాకుండా డిఎన్ఏ పరీక్షకు అంగీకరించలేదు. అయితే కోర్టు కల్పించుకోవడంతో రోహిత్ ఎట్టకేలకు విజయం సాధించారు. ఈ వేడుకతో గత కొంతకాలంగా వార్తల్లోకి ఎక్కిన ఈ వివాదానికి పెళ్లి ద్వారా తివారీ శుభం కార్డు పలికారు.
May 15 2014 7:52 PM | Updated on Mar 22 2024 10:39 AM
Advertisement
Advertisement
Advertisement
