రష్యాతో భారతదేశానికి ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం అపూర్వమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత దేశానికి రష్యా పెట్టని కోటలా ఎప్పుడూ మంచి అండగా ఉంటోందని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరిపిన అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఒకసారి బ్రెజిల్లోను, మరోసారి ఆస్ట్రేలియాలోను ఇప్పటికి రెండుసార్లు తాను వ్లాదిమిర్ పుతిన్ను కలిసినట్లు తెలిపారు. సైనికుల శిక్షణపై భారత్, రష్యాల మధ్య ఒప్పందం కుదిరింది. పుతిన్కు భారత్లో ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నామని మోదీ అన్నారు. రష్యా సహాయంతో మరో 10 అణు రియాక్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రెండు దేశాల మధ్య 2000 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వార్షిక సదస్సులను ప్రారంభించినప్పుడు పుతిన్ కూడా రష్యాకు ప్రధానమంత్రిగానే ఉన్నారన్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం మరి దేంతోనూ పోల్చలేమని ఆయన స్పష్టం చేశారు. చరిత్రలో అత్యంత క్లిష్టమైన సందర్భాలు వచ్చినప్పుడు కూడా భారతదేశానికి రష్యా చాలా నిబద్ధత కలిగిన మద్దతుదారుగా ఉందని అన్నారు. అంతరిక్ష పరిశోధనలో భారతదేశానికి మరింత సహకారం అందిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. ముందు నుంచి భారతదేశానికి రష్యా మద్దతుగా నిలుస్తోందని, కొన్ని దశాబ్దాలుగా భారత్తో రక్షణ ఒప్పందాలను కలిగి ఉందని ఆయన అన్నారు.
Dec 11 2014 5:24 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement
