ఆదిలాబాద్ జిల్లాను వర్షం ముంచెత్తింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు భారీ వర్షంకురిసింది. తూర్పు జిల్లా పరిధిలోని మంచిర్యాల, చెన్నూర్, ఆసిఫాబాద్ డివిజన్‌లో కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. ఖరీఫ్ సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవడం.. రైతులు పంట వేయకపోవడంతో పంట నష్టమేమీ జరగలేదు. కానీ పలు చోట్ల కురిసిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. జైపూర్ మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గొల్లవాగు ప్రాజెక్ట్ ప్రధాన కాల్వకు గండి పడింది. దీంతో భీమారం గ్రామాలోని బీసీ కాలనీలో వంద ఇళ్లు నీట మునిగాయి. రూ.15లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. నిలువ నీడ లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.