ఆదరణ.. అపూర్వం
● స్వేచ్ఛగా ఎన్నికలు జరిగిన చోట
వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం
● పల్లె సీమల్లో పట్టు నిలుపుకున్న
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
● వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల గెలుపుతో పార్టీలో జోష్
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజా మద్దతు ముందు అధికార పార్టీ కుట్రలు పటాపంచలయ్యాయి.. ఓటరు అభిమానం ముందు ఖాకీల కుతంత్రాలు తుత్తునియలయ్యాయి. పంచాయతీ ఎన్నికల రెండో విడతలో భాగంగా ఆదివారం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లోని 13 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 202 పంచాయతీలకు గాను 113 ఏకగ్రీవం కాగా 89 సర్పంచ్‌స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా తొలి విడతలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు హవా చూపించడంతో బెంబేలెత్తిపోయిన కూటమి నేతలు రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలకు తెరలేపారు. ప్రతిష్టాత్మక పంచాయతీలైన వేంపల్లె, చెన్నూరు లాంటి చోట్ల అధికార బలమంతా ఉపయోగించారు. మిగతా చోట్ల ఎప్పట్లాగే దౌర్జన్యాలకు దిగారు. పల్లె ఓటర్లు ధైర్యంగా ముందడుగు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగిన చోటల్లా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ప్రశాంత పోలింగ్ నిర్వహించిన పంచాయతీల్లో సుమారు 80శాతం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం కై వసం చేసుకున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీకి పల్లెల్లో పట్టు
వైఎస్సార్‌సీపీకి పల్లె ఓటర్లలో ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని మరోసారి రుజువైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సాగించిన సంక్షేమానికి పల్లె ఓటర్లు జై కొట్టారు.. పంచాయతీలో చేసిన అభివృద్ధికి తాజా ఎన్నికల్లో ఆదరణ చూపించారు. రెండో విడత ఎన్నికల్లో మొత్తం 89 సర్పంచ్ అభ్యర్థులకు గానూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 54చోట్ల గెలుపొందారు. ఇందులో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, జెడ్పీ చైర్మన్ పుత్తా నరసింహారెడ్డి సొంత నియోజకవర్గమైన కమలాపురంలో మెజార్టీ స్థానాలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కైవసం చేసుకోవడం విశేషం.
పులివెందుల నియోజకవర్గంలో 51 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించిన పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోయారు. ఏకపక్ష పోలింగ్‌కు పరిమితమైన ప్రాంతాల్లో మాత్రమే టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 35పంచాయతీల్లో విజయం సాధించారు. 14 పంచాయతీలు టీడీపీ వర్గీయులు దక్కించుకున్నారు. లింగాల మండలం బోనాలలో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ఒక్క చోట జనసేన మద్దతుదారుడు గెలుపొందాడు. పులివెందులలో ప్రజాక్షేత్రంలో తలపడడం టీడీపీ సాధ్యం కాదని ఇట్టే తెలిసిపోయింది. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేస్తే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఘనవిజయం తప్పదని రూఢీ అయ్యిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.


