పోలీసుల ఓవర్‌యాక్షన్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీసుల ఓవర్‌యాక్షన్‌

Nov 30 2026 2:04 AM | Updated on Nov 30 2026 2:04 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.

రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన తనయుడు నరేన్‌ రామాంజులరెడ్డి గృహ నిర్బంధం

● పోలీసుల వైఖరిని నిరసిస్తూ

జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన నేతలు

కడప కార్పొరేషన్‌: రెండో విడత పంచాయతీ ఎన్నికల వేళ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. తెల్లవారుజాము నుంచే వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన తనయుడు కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్‌ను గృహ నిర్భంధం చేశారు. చెన్నూరులో ఓటు వేసేందుకు వెళ్తానన్నా నరేన్‌ రామాంజులరెడ్డిని బయటికి పంపలేదు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్మిత్‌రోడ్డులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం ఎదుట వారు బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకొని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌ తదితరులు వారికి వద్దకు చేరుకొని మద్దతు తెలిపారు.

టీడీపీ రౌడీ మూకలకు పోలీసుల మద్దతు

తెలుగుదేశం పార్టీ రౌడీ మూకలకు పోలీసులు మద్దతు ఇస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కమలాపురం నియోజకవర్గంలో 34 గ్రామపంచాయతీల్లో పోలింగ్‌ జరుగుతోందని, ఆయా గ్రామాల్లో తమ పార్టీ నాయకులను, ఏజెంట్లను తెల్లవారుజాము నుంచే అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్లలో కూర్చోబెట్టారన్నారు. బుసిరెడ్డిపల్లెలో తమ పార్టీ నాయకులపై దాడి చేసి తలలు పగులగొట్టారన్నారు. ఇంత దౌర్జన్యం, దుర్మార్గం ఎక్కడా, ఎప్పుడూ చూడలేదని...ఇది ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు.

ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి

ప్రజలకు రక్షణ కల్పించడానికి, వారి హక్కులను కాపాడటానికే పోలీసులు ఉన్నారని, వారికి ఆ డ్రెస్‌ ఇచ్చింది అందుకేనని కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్‌ రామాంజులరెడ్డి అన్నారు. పోలీసులు వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారని, టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. చెన్నూరులో తనకు ఓటు హక్కు ఉందని, అక్కడికి పోయి ఓటు వేద్దామంటే పోలీసులు పోనివ్వడం లేదన్నారు. ప్రజలే పోలీసులపై తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు. ఉదయం 11 గంటలవుతున్నా తనను ఓటేసేందుకు పోలీసులు పంపకపోవడంతో నరేన్‌ రామాంజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారులో బయలుదేరబోతుండగా పోలీసులు కారును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, వైఎస్సార్‌సీపీ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది. మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్‌ కుమార్‌, సీహెచ్‌ వినోద్‌, వెంకటేశ్వర్లు, ఐస్‌క్రీం రవి, శ్రీరంజన్‌రెడ్డి, త్యాగరాజు, నాగేంద్ర, రెడ్డిప్రసాద్‌, సుబ్బరాయుడు, ఏ1నాగరాజు,అఖిల్‌, కంచుపాటి బాబు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు దీప్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement