● పెద్దసంఖ్యలో విద్యార్థులు హాజరు
● ఆంగ్లంపై ఆసక్తి పెరుగుతుందంటున్న విద్యార్థులు
కడప ఎడ్యుకేషన్ : సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ ‘బీ’కాంపిటీషన్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కడప నగరంలోని నాగార్జున మోడల్ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన స్పెల్ ‘బీ’లెవల్–2 పోటీలకు జిల్లాలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ పోటీలు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగాయి. ఆంగ్లం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి, భాషపై పట్టు సాధించేలా ఈ పోటీలు ఉన్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ ఏడాది సాక్షి మీడియా గ్రూప్ స్పెల్ ‘బీ’కాంపిటీషన్‌ను లెవల్–1, లెవల్–2, సెమీఫైనల్స్, ఫైనల్స్ దశల్లో నిర్వహిస్తోంది. ఆదివారం నాటి లెవల్–2 పోటీలలో భాగంగా కేటగిరీ–1లో 1, 2 తరగతులు, కేటగిరీ–2లో 3, 4 తరగతులు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. నాగార్జున మోడల్ స్కూల్, జీఎంఆర్ స్కూల్, జీఆర్‌టీ జీవీకే స్కూల్, కడప పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, శివ శివానీ స్కూల్, మోంట్‌ఫోర్ట్ స్కూల్, నేతాజీ స్కూల్, గురజాల, సింహాద్రిపురం, వేంపల్లి శ్రీచైతన్య పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. ఆంగ్లంపై మక్కువ పెంచేలా కృషి చేస్తున్న ‘సాక్షి’కి వారు కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన కాంపిటీషన్‌కు అసోసియేట్ స్పాన్సర్ గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమండ్రి, ప్రెసెంటింగ్ స్పాన్సర్ గా డ్యూక్స్ వ్యాపి వ్యవహరించారు.


