శాంతి నిలయం.. పేతురు ఆలయం | - | Sakshi
Sakshi News home page

శాంతి నిలయం.. పేతురు ఆలయం

Nov 30 2026 1:52 AM | Updated on Nov 30 2026 1:52 AM

● 139 ఏళ్ల ఘన చరిత్ర

● డిసెంబర్‌ 2, 3 తేదీల్లో కలసపాడులో గుడి తిరునాల

కలసపాడు : సగిలేరు నది ఒడ్డున, నూతనంగా నిర్మించిన తెలుగుగంగ అక్విడక్ట్‌ కాలువ పక్కనే ఉన్న పరిశుద్ధ పరిపేతురు పౌలు ఆలయం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. అక్కడి ప్రశాంత వాతావరణం సందర్శకులను లోనికి ఆహ్వానిస్తుండగా, ఆలయ అంతర్గత అందాలు, అపురూప నిర్మాణ శైలి మనసుకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి. ఒక్కసారి సందర్శిస్తే మళ్లీ మళ్లీ రావాలనిపించేలా ఉన్న ఈ పుణ్యక్షేత్రం 139వ ప్రతిష్టా మహోత్సవానికి ముస్తాబైంది.

1884లో నిర్మాణం ప్రారంభం

కలసపాడు పరిసర ప్రాంతాల్లో క్రైస్తవులు ప్రార్థనలు చేసుకునేందుకు సరైన ఆలయం లేదని భావించిన ఇంగ్లాండ్‌కు చెందిన రెవరెండ్‌ ఆర్థర్‌ ఇన్‌మన్‌ 1884లో ఈ చర్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మూడేళ్ల నిరంతర శ్రమ అనంతరం 1887 డిసెంబర్‌ 3న ఆలయ నిర్మాణం పూర్తయింది. నాటి నుంచి ఏటా డిసెంబర్‌ 2, 3 తేదీల్లో ప్రతిష్టా మహోత్సవాన్ని (గుడి తిరునాల) భక్తిశ్రద్ధలతో జరుపుతున్నారు. ప్రస్తుత నంద్యాల డయాసిస్‌ బిషప్‌ రైట్‌ రెవరెండ్‌ కామనూరి సంతోష్‌ ప్రసన్నరావు ఇదే గ్రామానికి చెందినవారు కావడంతో, విదేశాల నుంచి సైతం విరాళాలు సేకరించి చర్చి అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారు.

ఇటుకలు, కోడిగుడ్ల సొనతో అద్భుత కట్టడం

ఆలయ నిర్మాణంలో వినియోగించిన సామగ్రి, పనితనం నేటికీ ఆశ్చర్యం కలిగిస్తాయి. స్థానికంగా లభించే బంకమట్టితో తయారు చేసిన ఇటుకలకు ఇసుక, సున్నం, బెల్లం నీటితో పాటు లక్షలాది కోడిగుడ్ల సొనను కలిపి గానుగలో తిప్పిన మిశ్రమంతో గోడలను నిర్మించారు. గోడలకు నునుపుదనం కోసం వేసే పైపూతలోనూ గుడ్ల సొనను వాడటం విశేషం. తలుపులు, కిటికీలకు టేకు, తాటి కలపను, పైకప్పుకు కేరళ పెంకులను అమర్చారు. తాజాగా చర్చి పైకప్పు పెంకులను మార్చి నూతన పెంకులతో మరింత పటిష్టం చేశారు.

గంటగోపురం, బాప్టీజం తొట్టి ప్రత్యేకం

ఆలయం వెలుపల 40 అడుగుల ఎత్తులో నిర్మించిన గంట ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. గడియారాలు లేని రోజుల్లో పరిసర గ్రామాల ప్రజలకు సమయాన్ని తెలిపేందుకు దీనిని మోగించేవారు. చర్చి ముఖద్వారం వద్ద ఉన్న బాప్టీజం తొట్టిలోని పవిత్ర జలాన్ని భక్తులు తలపై చల్లుకుంటారు. ఉత్సవాల సమయంలో తమ చిన్నారులకు బాప్టీజం ఇప్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.గతంలో వర్షం వచ్చినప్పుడు భక్తులు ఇబ్బందులు పడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది చర్చి కమిటీ ఆధ్వర్యంలో భారీ జర్మన్‌ టెంట్లు వేశారు. మహిళల కోసం ప్రత్యేక స్నానపు గదులను నిర్మించారు.

లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

గుడి తిరుణాలకు కడప జిల్లా నుంచే కాకుండా కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా డిసెంబర్‌ 2న భోగి పండుగకు లక్ష మందికి పైగా హాజరవుతారు. 3వ తేదీ వేకువజాము నుంచే భక్తులు తలనీలాలు సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలతో మొక్కులు తీర్చుకుని భారీగా కానుకలు అందజేస్తారు.

చేరుకునే మార్గం ఇలా..

రైలు మార్గం : ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్‌లో దిగితే, అక్కడి నుంచి 33 కి.మీ. దూరంలో ఉన్న కలసపాడుకు బస్సు సౌకర్యం ఉంది. కడప రైల్వే స్టేషన్‌కు చేరుకుంటే, అక్కడి నుంచి 95 కి.మీ. ప్రయాణించి బస్సులో రావచ్చు.

బస్సు మార్గం : కడప, బద్వేలు, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా కలసపాడుకు నేరుగా బస్సులు ఉన్నాయి. మార్కాపురం, గిద్దలూరు (ప్రకాశం), ఉదయగిరి (నెల్లూరు), నంద్యాల (కర్నూలు) ప్రాంతాల నుంచి కూడా రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement