ప్రొద్దుటూరు : అమలాపురంలో ఆదివారం 68వ ఐఎంఏ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రొద్దుటూరు ఐఎంఏకు రాష్ట్రస్థాయిలో మూడు అవార్డులు దక్కాయి. వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం, ఉత్తమ సేవలు అందించడం, కార్యదర్శి డాక్టర్ టీడీ వరుణ్‌కుమార్‌రెడ్డి సేవలకు గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ కార్యదర్శిగా ఆయన అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ వైద్య నిపుణులు, ఐఎంఏ రాష్ట్ర మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ త్యాగరాజరెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సాయిప్రసాద్ పాల్గొన్నారు. అవార్డులు రావడం పట్ల ప్రొద్దుటూరు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వినోద్‌కుమార్, కార్యదర్శి డాక్టర్ టీడీ వరుణ్‌కుమార్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్ సురేష్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
కుటుంబ కలహాలతో
ఇరువర్గాల పరస్పర దాడులు
ఒంటిమిట్ట : కుటుంబ కలహాలు తారస్థాయికి చేరడంతో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా ఓ ఇంట్లో నెలకొన్న అంతర్గత సమస్య ఇరు కుటుంబాల మధ్య విభేదాలకు దారితీసింది. ఈ క్రమంలో ఆదివారం ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి వివాదం ముదిరింది. ఆగ్రహంతో వరుసకు బావ ,బావమరుదులై ఇద్దరు వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులను వివరణ కోరగా, తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
నేటి నుంచి న్యాయవాదుల విధుల బహిష్కరణ
కడప అర్బన్ : రాష్ట్రంలో నైట్ కోర్టుల ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కడప న్యాయవాదులు సోమవారం నుంచి డిసెంబర్ 4 వరకు కోర్టు విధులను బహిష్కరించనున్నారు. ఈ మేరకు కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.వి. రాఘవరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలో శనివారం జరిగిన రాష్ట్ర బార్ ఫెడరేషన్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తాము ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాయంకాలపు కోర్టుల ఏర్పాటును రాష్ట్ర బార్ కౌన్సిల్ ఇదివరకే వ్యతిరేకించిందని గుర్తుచేశారు. కొత్తగా నైట్ కోర్టులు ఏర్పాటు చేయడానికి బదులు, ప్రస్తుతం ఉన్న కోర్టులలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తులు, సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేసి కనీస సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో భాగంగా, శుక్రవారం తలపెట్టిన ‘ఛలో హైకోర్టు’ పిలుపు మేరకు కడప న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలివెళ్లనున్నట్లు రాఘవరెడ్డి వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
అట్లూరు : మండల పరిధిలోని కడప– బద్వేలు ప్రధాన రహదారిపై రెడ్డిపల్లె గ్రామ సమీపాన ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. ఒంటిమిట్ట మండలం దర్జిపల్లి గ్రామానికి చెందిన సింగమల వెంకటేశ్వర్లు ద్విచక్రవాహనంపై బద్వేలుకు వెళ్లి పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతూ రెడ్డిపల్లె గ్రామాపానికి రాగానే గేదెలు అడ్డు రావడంతో ప్రమాదవశాత్తు కిందపడ్డాడు.


