పులివెందుల : పులివెందుల పట్టణంలోని స్థానిక ఏసీఏ స్టేడియంలో ఆదివారం వైఎస్సార్ కడప జిల్లా జూనియర్ బాలురు, బాలికల బేస్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి సుమారు 160 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ఎంపికై న జిల్లా బాలికల జట్టు డిసెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు మార్కాపురం జిల్లా కనిగిరి మండలం, కంచెర్లవారిపల్లి క్రీడా మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల బేస్‌బాల్ ఛాంపియనన్‌షిప్ – 2026లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతకుముందు పులివెందుల ఏసీఏ స్టేడియంలో జరిగిన ఈ ఎంపిక పోటీలను జిల్లా బేస్‌బాల్ సంఘ కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, రిటైర్డ్ పీఈటీ, మానవత సంస్థ చైర్మన్ డీవీ కొండారెడ్డి, రిటైర్డు పీడీ విజయప్రసాద్ రెడ్డి, సీనియర్ పీడీలు శ్రీకాంత్ రెడ్డి, సి.వి.రమణ, సీనియర్ పీఈటీ తిరుపాల్‌లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మానవత సంస్థ చైర్మన్ డి.వి.కొండారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని, తద్వారా జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిటైర్డ్ పీడీ విజయప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే జాతీయస్థాయికి ఎదిగిన క్రీడాకారులను అభినందిస్తూ బేస్‌బాల్ క్రీడను జిల్లాలో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా సంఘ కార్యనిర్వాహక కార్యదర్శులు సుధాకర్, శ్రీను, బాబు, విష్ణు, అన్వేష్, మహేష్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సాగింది. కార్యక్రమంలో బేస్‌బాల్ సంఘ సభ్యులు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


