దౌర్జన్యపరులదే రాజ్యం.. దోపిడీదారులదే భోజ్యం | - | Sakshi
Sakshi News home page

దౌర్జన్యపరులదే రాజ్యం.. దోపిడీదారులదే భోజ్యం

Jun 23 2026 1:52 AM | Updated on Jun 23 2026 1:52 AM

దౌర్జన్యపరులదే రాజ్యం.. దోపిడీదారులదే భోజ్యం

సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో కొలువు తీరిన తర్వాత తెలుగుతమ్ముళ్లు జిల్లాలోని విలువైన ప్రకృతి సంపదపై పడ్డారు. రేయింబవళ్లు ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్‌ చేస్తూ ఖనిజాలను కొల్లగొడుతున్నారు. తమ దోపిడీకి ఎవరైనా అడ్డుగా నిలిస్తే అంతమొందించే స్థాయికి తెగబడుతున్నారు. ప్రధానంగా ఇసుక, గ్రావెల్‌, అమూల్యమైన బరైటీస్‌ నిక్షేపాలను ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు. చివరికి అధికారికంగా లీజు అనుమతులు ఉన్న వారైనా సరే, తాము చెప్పినట్లే వినాలని, తమ కనుసన్నుల్లోనే మైనింగ్‌ నిర్వహించాలంటూ కూటమి అక్రమార్కులు హుకుం జారీ చేశారు. అనుమతులు లేని చోట్ల కూడా యథేచ్ఛగా భారీ క్రేన్లు, హిటాచీలు బిగించి భూమాత గర్భాన్ని చీల్చుతున్నారు. ఈ విచ్చలవిడి ఇసుక గోతుల తవ్వకాల నేపథ్యంలోనే ఆదివారం అభం శుభం తెలియని ఇరువురు యువకులు పాపాఘ్ని నదిలో మృత్యువును చవిచూడటానికి కారణమైంది.

పులివెందులలో మైనింగ్‌ దారుణాలు..

ఒకే రాత్రి రూ. 10 కోట్ల లూటీ!

జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ఈ అక్రమ మైనింగ్‌కు ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. నియోజకవర్గ పరిధిలోని వేముల, వేంపల్లె, లింగాల మండలాల్లో టీడీపీ నేతలు అక్రమ మైనింగ్‌ను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కొండల్లో అడ్డగోలుగా బ్లాస్టింగ్‌లు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే వేముల మండలం అయ్యప్పపల్లెకు చెందిన ఒక అమాయక వ్యక్తి మృతి చెందిన ఘటన కూడా ఇటీవల వెలుగు చూసింది. వేముల మండలం కేంద్రంగా రెచ్చిపోయిన తెలుగుతమ్ముళ్లు ఏకంగా ఒకే రాత్రి రూ.10 కోట్ల విలువైన అమూల్యమైన బరైటీస్‌ ఖనిజాన్ని నిస్సిగ్గుగా దోపిడీ చేశారు. నేషనల్‌ కంపెనీ ఆఫ్‌ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) అధికారిక వేలంలో ఎంబసీ గ్రూపు కొనుగోలు చేసి, టిఫెన్‌ బరైటీస్‌ కంపెనీ ప్రాంగణంలో భద్రపరిచిన ప్రభుత్వ ఖనిజాన్ని రాత్రికి రాత్రే లూటీ చేశారు. దాదాపు 3,500 టన్నుల బరైటీస్‌ ఖనిజాన్ని భారీ టిప్పర్లతో తరలించుకుపోయారు. ఈ మెగా దోపిడీపై బాధిత టిఫెన్‌ కంపెనీ ప్రతినిధులు పోలీస్‌ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా, ఏడాది గడుస్తున్నా అక్రమార్కులపై పైసా చర్యలు తీసుకోలేదు. చివరికి కంపెనీ తమ స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు బిగించుకుంటున్నా కూటమి నేతలు సహించలేక బెదిరింపులకు దిగుతున్నారు.

పాపాఘ్ని గుల్ల..

బెంగళూరుకు ఇసుక తరలింపు!

మరోవైపు పాపాఘ్ని నది కేంద్రంగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా ద్వారా కూటమి నేతలు రోజుకు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. నది పరివాహక ప్రాంతంలో సుమారు 2 కిలోమీటర్ల మేర ఏకంగా 20 అడుగుల లోతుకు పైగా హిటాచీలతో తవ్వేసి, ఆ ఇసుకను నిత్యం పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరు నగరానికి తరలిస్తూ వందల కోట్లు వెనకేసుకుంటున్నారు. అడ్డగోలు తవ్వకాలతో జిల్లాలో భూగర్భ జలాలు అంతరించిపోతున్నా, స్థానికులు అడ్డు చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. ఎవరైనా నోరెత్తితే తెలుగుతమ్ముళ్లు మారణాయుధాలతో దాడులకు దిగుతుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం మారెళ్లమడక, గండికొవ్వూరు, కుమారకాల్వ, మరియు నిన్న ఇద్దరు చిన్నారులను బలిగొన్న అద్దాలమర్రి ప్రాంతాలలో నిత్యం వందలాది టిప్పర్లతో ఇసుక లూటీ యథేచ్ఛగా సాగుతోంది.

సీఎంకు ఫిర్యాదు చేసినా చలనం లేదు..

నిర్వీర్యంగా వ్యవస్థలు!

రాష్ట్రంలో వ్యవస్థలు తనంతట తానుగా రాజ్యాంగానికి, చట్టానికి లోబడి వ్యవహరిస్తేనే ప్రజల ధన, మాన, ప్రాణాలకు కొంతలో కొంతైనా రక్షణ ఉంటుంది. కానీ, జిల్లాలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. చట్టాన్ని పక్కనబెట్టి ‘దౌర్జన్యపరులదే రాజ్యం.. దోపిడీదారులదే భోజ్యం’ అన్న చందంగా జిల్లాను మార్చేశారు. ఈ అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే నేరుగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో జిల్లా యంత్రాంగం, మైనింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి.

కలెక్టర్‌, ఎన్‌జీటీ ఆదేశాలు గోవిందా..

చేష్టలుడిగిన ఖాకీలు!

పర్యావరణ పరిరక్షణ కోసం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) నదుల నుంచి ఇసుకను తరలించవద్దని అత్యంత స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో స్వయంగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ స్పందిస్తూ.. ఆగస్టు 15 వరకూ నదులలో నుంచి ఎలాంటి ఇసుక తరలింపులు జరపరాదని జిల్లా యంత్రాంగాన్ని కఠినంగా ఆదేశించారు. అయితే, కూటమి నేతలకు ఎస్కార్ట్‌గా నిలుస్తూ విచ్చలవిడి దోపిడీకి పరోక్షంగా కొమ్ముకాస్తున్న పోలీసుశాఖ ‘నిమ్మకు నీరెత్తినట్లు’గా వ్యవహరిస్తోంది. పోలీసుశాఖకు కళ్లు, చెవులుగా నిలుస్తూ నిరంతరం క్షేత్రస్థాయి సమాచారాన్ని అందించే ఇంటెలిజెన్స్‌ (నిఘా వర్గాల) నివేదికలను సైతం ఉన్నతాధికారులు పూర్తిగా బుట్టదాఖలు చేస్తున్నారు. ఈ అరాచక వ్యవస్థల నిర్వాకం వల్లే జిల్లా సంపద దోపిడీకి గురవుతూ, అమాయకుల ప్రాణాలు బలిపీఠం ఎక్కుతున్నాయని జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి నేతల ఇసుక, గ్రావెల్‌,

బరైటీస్‌ దందా

అడ్డుకుంటే అంతమొందిస్తామంటూ బరితెగింపు

ఖాకీల నీడలో.. ‘మైనింగ్‌’ మాఫియా

అడ్డగోలు తవ్వకాలే పాపాఘ్నిలో అన్నదమ్ముల మృత్యువుకు కారణం

వేముల వేదికగా ఒకే రాత్రి

రూ. 10 కోట్ల ఖనిజం లూటీ

ఎన్సీఎల్టీ వేలం నిల్వలపై

పగటిదొంగల పంజా

ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి నేరుగా

సీఎంకే ఫిర్యాదు చేసినా చలనం లేదు

నిర్వీర్యమైన వ్యవస్థలు, బుట్టదాఖలైన నిఘా నివేదికలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement