● ఆదివారం ఇద్దరు చిన్నారుల బలి
● రాత్రంతా బిడ్డల శవాల పక్కనే కన్నవారి జాగారం
● ఎంపీ అవినాష్‌రెడ్డి జోక్యంతో
దిగొచ్చిన కలెక్టర్
● సాయం ప్రకటన
చక్రాయపేట: కూటమి ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు ఆదివారం ఇద్దరు పసిప్రాణాలను బలిగొన్న ఉదంతం.. రాత్రి వేళ పాపాఘ్ని నది సాక్షిగా మహా ప్రజాపోరాటంగా మారింది. చక్రాయపేట మండలం అద్దాలమర్రి సమీపంలో ఇసుక మాఫియా తవ్వేసిన రాక్షస గుంతల్లో పడి అన్నదమ్ములు కారపురెడ్డి జయంత్ రెడ్డి, రాజ్ వర్ధన్ రెడ్డి మృతి చెందిన విషయం విదితమే. నిన్న రాత్రంతా కన్నబిడ్డల నిశ్చేతన దేహాలను గుండెలకు హత్తుకుని, ఆ కన్నవారు, బంధువులు, ఊరు ఊరంతా కలిసి నదిలోనే కన్నీటి జాగారం చేశారు. బాధ్యులను శిక్షించే వరకు శవాలను కదిలించనిచ్చేది లేదని భీష్మించారు. అధికారులు రాత్రంతా నదిలోనే మకాం వేసి, శవాలను పోస్టుమార్టంకు తరలించాలంటూ బాధిత కుటుంబంపై అడ్డగోలుగా ఒత్తిడి తెచ్చినప్పటికీ గ్రామస్థులు లొంగలేదు.
ఎంపీఆగ్రహం..దిగొచ్చిన యంత్రాంగం!
సోమవారం ఉదయాన్నే సమాచారం అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తక్షణమే నదిలోకి చేరుకుని, బాధితులకు కొండంత అండగా నిలిచారు. ‘బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన న్యాయం జరిగే వరకు ఈ చిన్నారుల శవాలతో పాటు నదిలోనే నేనూ కూర్చుంటా’ అని ఎంపీ కరాఖండిగా తేల్చి చెప్పా రు. ఎంపీ నేరుగా రంగంలోకి దిగి అధికారులను నిలదీయడంతో, అప్పటివరకు కాలయాపన చేసిన అధికార యంత్రాంగం ఒక్కసారిగా దిగొచ్చింది.
తప్పు ఒప్పుకున్న ఆర్డీవో: ఎంపీ అవినాష్ రెడ్డి పోరాటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పులివెందుల ఆర్డీవో చిన్నయ్య విలేకరుల ముందుకు వచ్చి, నదిలో నిబంధనలకు విరుద్ధంగా 15 నుంచి 20 అడుగుల లోతుకు పైగా అక్రమ ఇసుక తవ్వకాలు సాగిన మాట వాస్తవమేనని బహిరంగంగా అంగీకరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బాధితులకు తక్షణ న్యాయం మరియు చర్యలను ప్రకటించారు. మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబానికి కలెక్టర్ ఫండ్ నుంచి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తారు. పెండ్లిమర్రి మండలంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున 5 సెంట్ల ఇళ్ల స్థలాన్ని మంజూరు చేస్తారు. కాగా, నదిలో అక్రమ తవ్వ కాలకు వాడుతున్న రెండు భారీ హిటాచీ మిషన్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇసుక రవాణా కోసం నదిలో వేసిన అక్రమ మట్టి రోడ్లను జేసీబీలతో పూర్తిగా ధ్వంసం చేయించారు. ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో ఆర్‌కే వ్యాలీ సీఐ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మృతదేహాలను పోస్టుమా ర్టానికి తరలించారు. కూటమి నేతల కాసుల కక్కుర్తికి పసిప్రాణాలు బలికావడంపై జిల్లాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.


