దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే పరిగణించాలి | - | Sakshi
Sakshi News home page

దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే పరిగణించాలి

Jun 23 2026 1:40 AM | Updated on Jun 23 2026 1:40 AM

మతం మారినా దళితుల సామాజిక,

ఆర్థిక వెనుకబాటుతనం పోదు...

దళిత క్రైస్తవులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది...

కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి

కడప కార్పొరేషన్‌ : దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) జాబితాలో కొనసాగిస్తూ వారికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కడప రోమన్‌ కాథలిక్‌ డియోసెస్‌ బిషప్‌ రెవరెండ్‌ పాల్‌ ప్రకాష్‌ సగినాల కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని కోరారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కడప రోమన్‌ కాథలిక్‌ డియోసెస్‌ బిషప్‌ రెవరెండ్‌ పాల్‌ ప్రకాష్‌, పలువురు గురువులు కడప ఎంపీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా బిషప్‌ రెవరెండ్‌ పాల్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశంలో క్రైస్తవుల్లో దళితులే కాదని, అనేక మంది వివిధ కులాలకు చెందిన వారు ఉన్నారని, కానీ మతం మారినంత మాత్రాన శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం దళితుల పట్ల తొలగిపోదని వివరించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించిందని, ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉన్నప్పుడు, దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినందుకు మాత్రమే ఎస్సీ హోదా నిరాకరించడం సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. కానీ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు దళితులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని, తప్పక దళిత క్రైస్తవుల పట్ల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎస్సీ హోదా వర్తించేలా చూడాలని కోరారు. ఈ విషయమై కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి స్పందిస్తూ ...దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై వైఎస్‌ జగన్‌ మోహాన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. అదే వైఖరికి వైఎస్సార్‌సీపీ ఇప్పటికీ కట్టుబడి ఉందని, దళిత క్రైస్తవుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందన్నారు. అంతేకాకుండా బాలకష్ణన్‌ కమిషన్‌ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించి దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా సానుకూల సిఫార్సులు చేస్తున్నామని, ఇప్పటికే వైస్సార్‌సీపీ ఎంపీలు జస్టిస్‌ బాలకష్ణన్‌కమిషన్‌న్‌కు వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. దళితుల హక్కులకు భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా తప్పక అడ్డుకుంటామని, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. అవసరమైతే పార్లమెంట్‌ వేదికగా కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్‌ బూసిపాటి ఆధ్వర్యంలో చేపట్టిన పోస్టు కార్డు ఉద్యమానికి మద్దతుగా సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు పంపుతున్న పోస్టు కార్డులను బిషప్‌, పాస్టర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి సునీల్‌ కుమార్‌, మాజీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ వినోద్‌ కుమార్‌, వైద్య విభాగం సభ్యుడు డా. పెంచలయ్య, పి. సంపత్‌, శ్యాంసన్‌, లారెన్స్‌, జోజప్ప, శ్యామ్‌, అధిక సంఖ్యలో పాస్టర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement