● కనిపించని మ్యాపింగ్ ఓటర్ల వివరాలు
● 2002 జాబితా ప్రదర్శించకపోవడంతో ఆందోళన
జమ్మలమడుగు : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) గందరగోళంగా సాగుతోంది. గత నెల నుంచి క్షేత్ర స్థాయిలో బూత్ లెవల్ అధికారులు(బీఎల్‌ఓ) 2002, 2025 ఓటర్ల జాబితాను సరిపొల్చుకుంటూ మ్యాపింగ్ చేపట్టారు.ఈనెల 14 నాటికి ఓటర్లను మ్యాపింగ్ చేసి క్షేత్ర స్థాయిలో 15 నుంచి ఇంటింటి సర్వేలో భాగంగా నోటీసులు ఇస్తున్నారు..ఎన్యుమరేషన్ పత్రాలను కొన్ని గ్రామాల్లో బీఎల్‌ఓలు కాకుండా గ్రామ కట్టుబడులతో పంపిణీ చేశారు. ఈ పత్రాలను నింపి ఆధార్‌కార్డు, ఫొటో అంటించి సచివాలయంలో ఇవ్వాలని చెప్పి పోతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు దీనిపై అవగాహన లేక తికమక పడుతున్నారు.
కనిపించని మ్యాపింగ్ జాబితా
జిల్లాలోని ఏడు నియోజకవర్గాలో మొత్తం 16,52,453 మంది ఓటర్లు ఉండగా అందులో ఈనెల 14 నాటికి దాదాపు 70శాతం పైగా 2002, 2025 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేశారు. అయితే నియోజవర్గాల్లోని బీఎల్‌ఓల వద్ద మ్యాపింగ్ అయిన జాబితా కనిపించడంలేదు. జాబితాను పోలింగ్‌బూత్‌ల వారీగా ప్రింట్ తీసి ప్రదర్శించాలి. అలా కాకుండా ఎన్నికల అధికారులు మాత్రం ఆన్‌లైన్‌లో కానీ, మీ బీఎల్‌ఓల వద్ద చూసుకోవాలని చెబుతున్నారు. దీంతో ఎవరి ఓటు మ్యాపింగ్ అయిందో తెలియని పరిస్థితి నెలకొంది.అధికారులు మాత్రం 70శాతం పైగా మ్యాపింగ్ చేశామని చెబుతున్నారే తప్ప ఏయే ఓటర్ల జాబితా మ్యాపింగ్ అయిందో చెప్పకపోవడంతో ఓటర్లలో గందరగోళం నెలకొంది.
చాలామంది ఓటర్ల వివరాలు 2002 జాబితాలో లేవు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.ఓటర్లకు అప్పటిలో ఓటుహక్కు లేకపోవడం, 18 ఏళ్లు వచ్చినా ఓటు కోసం దరఖాస్తు చేసుకోకపోవడం తదితర కారణాలతో అప్పట్లో ఓటుహక్కు పొందలేకపోయారు. ఈ క్రామంలో వీరి తల్లిదండ్రులు, తాత, అవ్వల వివరాలు పోల్చి చూసి సర్ సర్వే చేయాలి. అయితే కొన్ని చోట్ల 2002 జాబితాకు సంబంధించిన ఐడీ కార్డు కావాలని అడుగుతున్నారు. అప్పటి కార్డులను ఓటర్లు ఎందు ఉంచుకుంటున్నారని ప్రశ్నిస్తున్నా బీఎల్‌ఓలు పట్టించుకోకపోవడం గమనార్హం.


