కడప అర్బన్ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై, ఫ్యాక్షన్‌తో సంబంధం ఉన్న వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫ్యాక్షన్ జోన్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, ఎస్సీ, ఎస్టీ సెల్, డీసీఆర్‌బీ, డీటీఆర్‌బీ, కోర్ట్ మానిటరింగ్ సెల్, కమాండ్ అండ్ కంట్రోల్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ట్రాఫిక్ సీఐ లను ఆదేశించారు. సోషల్ మీడియాలో మహిళలు , బాలికలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసుల్లో ఉన్నవారి కదలికలపై నిఘా ఉంచాలని పదే పదే స్మగ్లింగ్ కు పాల్పడేవారిపై పీడీ చట్టం ప్రయోగించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్ ) గుర్తించి ఇతర శాఖల అధికారుల సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అడిషనల్ ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
సత్వరమే అర్జీల పరిష్కారం
జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’’కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం 144 ఫిర్యాదులు పీజీఆర్‌ఎస్‌కు వచ్చాయి. వృద్ధులు, దివ్యాంగుల వద్దకే జిల్లా ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌న్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితుల్లో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలని, బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి. ఎస్పీ ఎన్. సుధాకర్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


