కమలాపురం : యోగా సాధనతో ఆరోగ్యకర జీవితం లభిస్తుందని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) సీఎంఓ రామమూర్తి తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీసీసీపీఎల్‌లో కార్మికులు, ఉద్యోగులు, ప్రతినిధులు పలు రకాల యోగాసనాలు వేశారు. అలాగే డీఏవీ పాఠశాల విద్యార్థులందరూ వివిధ రకాల భంగిమల్లో యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా సీఎంఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో శారీరక, మానసిక ఉల్లాసం కోసం, ఆరోగ్యం కోసం యోగా చేయాలన్నారు. ప్రస్తుత తరుణంలో ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు, పరుగుల మీద జీవనం సాగిస్తుండటంతో రోగాల బారిన పడుతున్నారని వివరించారు. అదే యోగా చేస్తే ఏకాగ్రత పెరగడంతోపాటు ఎలాంటి రోగాలు దరి చేరవని సూచించారు. అలాగే బలహీనతలను తొలగించి, చైతన్య వంతుల్ని చేస్తుందన్నారు. భారతి డీఏవీ విద్యార్థులతో ఆయన ముచ్చటిస్తూ యోగా చేయడం ద్వారా చదువులో ఏకాగ్రత పెరుగుతుందని, ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. డీఏవీ భారతి విద్యార్థులు విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా తదితర వాటిలో రాణించడం హర్షణీయం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వారంలో కనీసం రెండు రోజులైనా నిర్వహించాలని ఆయన ప్రిన్సిపల్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బీసీసీపీఎల్ సీఎంఓ రామమూర్తి
భారతి సిమెంట్ కంపెనీలో
యోగా దినోత్సవం


