అక్రమ మద్యం విక్రేతలపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం విక్రేతలపై కేసు నమోదు

Jun 22 2026 1:48 AM | Updated on Jun 22 2026 1:48 AM

అక్రమ మద్యం విక్రేతలపై కేసు నమోదు భూ ఆక్రమణకు టీడీపీ నాయకుడి యత్నం వివాహం రద్దుతో ఆత్మహత్య

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు కడప ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సీఐ కృష్ణ కుమార్‌ పేర్కొన్నారు. ఈ నెల 20, 21 తేదీలలో అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్‌ షాపులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిపై దాడులు చేసినట్లు తెలిపారు. 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని, ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

178 మద్యం బాటిళ్లు స్వాధీనం

బి.కోడూరు : బి.కోడూరు పోలీసుస్టేషన్‌ పరిధి బద్వేలు – పోరుమామిళ్ల ప్రధాన రహదారిలో ఆదివారం రాత్రి నిర్వహించిన వాహనాల తనిఖీల్లో.. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 178 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. మద్యం తరలిస్తున్న రామచంద్రాపురం గ్రామానికి చెందిన అన్నం రమణయ్యపై కేసు నమోదు చేసి, ఆటోను స్వాధీన పరుచుకున్నట్లు పేర్కొన్నారు.

వీరపునాయునిపల్లె : మండలంలోని అలిదెన ఓబాయిపల్లెలో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే నంబరు 169లో 30 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తమ పార్టీ నాయకుల సహకారంతో ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని గ్రామానికి చెందిన 10 మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలుమార్లు ఆక్రమణకు యత్నించారని, వారిని అడ్డుకున్నామని బాధితులు పేర్కొన్నారు. ఆదివారం వెంకటేశ్వరయ్య అనే వ్యక్తి పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో తమ గడ్డివాములను తొలగించేందుకు యత్నించారని, వారిని అడ్డుకోవడంతో పోలీసులు దుర్భాషలాడారని వాపోయారు.

పోరుమామిళ్ల : మండలంలోని సిద్దవరం పంచాయతీ చిన్నాయపల్లెకు చెందిన ఇండ్ల శ్రావణి(22) ముందుగా అనుకున్న వివాహం రద్దు కావడంతో.. మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ హనుమంతు తెలిపారు. ఈ మేరకు శ్రావణి తండ్రి ఇండ్ల చిన్న ఓబులేసు (54) ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎస్‌ఐ కథనం మేరకు.. ఈ నెల 18న ఓబులేసు, భార్య సుబ్బమ్మ, తల్లి చెన్నమ్మలతో కలసి పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి, కూతురు శ్రావణి పురుగుల నివారణ మందు తాగి కనిపించిందన్నారు. ఆమెను విచారణ చేయగా వివాహం రద్దు కావడంతో ఇక తనకు వివాహం కాదేమోనన్న వేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పిందన్నారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం కడపలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందిందన్నారు. ఈ మేరకు చిన్న ఓబులేసు ఆదివారం స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేశామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement