తమ్ముళ్ల ధనదాహం..
చెట్టంత కొడుకులు మృతి..
కన్నవారికి కడుపుకోత!
చేతికి ఎదిగిన ఇరువురు కుమారులు ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబం వేదన వర్ణనాతీతంగా మారింది. చెట్టంత కొడుకులు విగతజీవులుగా పడి ఉండటంతో తండ్రి కారపురెడ్డి లోకేశ్వరరెడ్డి దంపతులు గుండె పగిలి అక్కడే కుప్పకూలిపోయారు. ‘ఏమి అన్యాయం చేశాం దేవుడా.. మాకెందుకు ఇంత శిక్ష విధించావు‘ అంటూ ఆ కన్నవారి రోదనలు మిన్నంటాయి. ఇరువురు యువకుల్ని విగత జీవులుగా చూసి తరలివచ్చిన బంధువుల కడుపు తరుక్కుపోయింది. అక్కడ చేరిన మహిళలు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్న విషాదకర దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. లోకేశ్వరరెడ్డి దంపతుల కడుపుకోతను అక్రమార్కులు లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు తీర్చగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే నిందితులపై క్రిమినల్ చర్యలు చేపట్టి బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నారు.
కూటమి నేతల స్వార్థం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అన్నదమ్ముల జలసమాధి
ఎన్‌జీటీ ఆదేశాలూ బుట్టదాఖలు.. బీటెక్ రవి సహకారంతోనే దందా!
ఆగస్టు 15 వరకు నిషేధమున్నా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఇసుక లూటీ
చెట్టంత కొడుకులు విగతజీవులుగా మారడంతో కన్నవారి గుండెకోత
రాత్రి 10 గంటలైనా నదిలోనే మృతదేహాలు అద్దాలమర్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత
యంత్రాల సీజ్ కోసం భీష్మించిన బంధువులు, వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, కడప/చక్రాయపేట : కూటమి నేతల స్వార్థం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ఇద్దరు అమాయక యువకులను బలితీసుకుంది. చక్రాయపేట మండలం అద్దాలమర్రి సమీపంలో కొన్ని నెలలుగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా దందా.. కారపురెడ్డి జయంత్‌రెడ్డి, రాజ్‌వర్ధన్ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములను నిలువునా మింగేసింది. తెలుగుతమ్ముళ్ల ధనదాహానికి తోడు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే ఈ ఘోర కలి చోటుచేసుకుంది.
మృతదేహాల తరలింపునకు అడ్డుకట్ట..
రాత్రి 10 గంటలైనా నదిలోనే నిరసన!
అద్దాలమర్రి వద్ద అక్రమ ఇసుక క్వారీ గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు చనిపోయారని తెలియడంతో పోలీసు యంత్రాంగం, వేంపల్లె అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నది నుంచి వెలికి తీయించారు. అయితే, ఇద్దరు ప్రాణాలు కోల్పోయేందుకు కారకులైన క్వారీ నిర్వాహకులు వచ్చేంత వరకు, అక్కడున్న మైనింగ్ యంత్రాలను సీజ్ చేసేంత వరకు మృతదేహాలను తరలించే ప్రసక్తే లేదంటూ బంధువులు, గ్రామస్థులు నదిలోనే బైఠాయించారు. ఆర్కే వ్యాలీ సీఐ శంకర్ రెడ్డి బాధితులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ రాత్రి 10 గంటలైనా మృతదేహాలతో నదిలోనే నిరసన కొనసాగించారు. ఈ ఘోరం గురించి తెలుసుకుని ఎంపీపీ మాధవీబాలకృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు శ్రీధర్ రెడ్డి, జనార్ధనరెడ్డి, చెన్నారెడ్డి, శేషారెడ్డి, చంద్రారెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు పూర్తి మద్దతుగా నిలిచారు.
ఆర్డీవో నిలదీత
చక్రాయపేట : ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుతుంటే పట్టించుకోని వారు ఇప్పుడు కంటి తుడుపు చర్యలకు వచ్చారా...అసలు మీకు ఏది ముఖ్యం ప్రజల ప్రాణాలా.. లేక ఇసుక మాఫియా ప్రయోజనాలా తేల్చి చెప్పాలని మృతుల బంధువులు పులివెందుల ఆర్డీవో చిన్నయ్యను నిలదీశారు. అద్దాలమర్రి సమీపంలోని పాపాఘ్ని నదిలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలుసుకొని ఆయన రాత్రి 9 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు.పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ రాత్రి10 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు. వారు అక్కడికి రాగానే అక్కడ ఉన్న వారంతా ఒక్కమారుగా లేచి ఈ పాపానికి బాధ్యత ఎవరు వహిస్తారని నిలదీశారు. దీంతో ఆర్డీఓ ఫోన్ ద్వారా విషయాన్ని కలెక్టర్‌కు వివరించారు.అనంతరం మృతుల తండ్రిని పక్కకు పిలిచి మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయినా కలెక్టరు వచ్చే వరకు మృతదేహాలను తీసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాత్రి 11గంటల వరకు కూడా వారు శాంతించక పోవడంతో మృతదేహాలు పాపాఘ్ని నదిలోనే ఉండి పోయాయి.


