ప్రొద్దుటూరు కల్చరల్ : దేశ ఓటరు భవిష్యత్తును అత్యంత ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఓటరు సర్వే ఎస్‌ఐఆర్ అని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) వ్యవస్థాపక నాయకుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరులోని ఏకేఆర్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు ఎస్‌ఐఆర్ నిర్వహించిన రాష్ట్రాల్లో కోట్లాది మంది ఓటర్లను తొలగించారన్నారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్ ముగిసిన తర్వాత ఫైనల్ లిస్టులో ఒక అడ్రస్‌లో 900 ఓటర్లు ఉన్నారన్నా. కానీ తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఒక్క ఓటరు లేరన్నారు. దీన్ని బట్టి ఎస్‌ఐఆర్ నిజంగా దొంగ ఓట్లను, మరణించిన వారి ఓట్లనే తొలగిస్తుందని గ్యారెంటీ లేదన్నారు. అభ్యర్థుల ఓట్లు లెక్కించి ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వెల్లడించి గెలుపును ప్రకటించడం ఎన్నికల కమిషన్ పని అన్నారు. కానీ ఎన్నికల కమిషన్ గెలిచిన అభ్యర్థిని ప్రకటించాక ఓట్ల లెక్కింపు వివరాలు చెబుతున్నారంటే దేశంలో ప్రజాస్వామ్యానికి ఏ గతి పట్టిందో అర్థమవుతోందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధనా కార్యదర్శి కె.ప్రసాద్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌లో 2002లో మీరు ఎక్కడ ఓటేశారు, ఏ బూత్‌లో వేశారు, ఏ పార్ట్ నంబర్ మీది అనే వివరాలతో సహా నేడు ఎన్యూమరేషన్ ఫాంలో పూర్తి చేస్తేనే మీ ఓటింగ్ మ్యాపింగ్ అవుతుందన్నారు. లేకుంటే మీ ఓటు గల్లంతే అని అన్నారు. జూలై 14 ఇంటింటి ఓటర్ సర్వే పూర్తయి జూలై 21న ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటిస్తారన్నారు. ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు, ఇప్పట్లో ఎన్నికలు లేవు కదా అని మరి కావాల్సిన సమయం ఇచ్చి ఎస్‌ఐఆర్‌ను పూర్తి చేయొచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జై భారత్ జాతీయ అధ్యక్షుడు లోక్‌నాథ్, జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, జిల్లా అధ్యక్షుడు పల్లవోలు రమణ, ప్రధాన కార్యదర్శి శివరాం, విరసం నాయకురాలు వరలక్ష్మి, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సర్పంచ్‌ల సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు శివచంద్రారెడ్డి, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్, జమా అతె ఇస్లాం హింద్ నాయకులు రెహాన, రాయలసీమ మహిళా శక్తి నాయకురాలు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
అవగాహన సదస్సులో డాక్టర్ బ్రహ్మారెడ్డి


