● రీజినల్ కో ఆర్డినేటర్
శ్రీనివాసులురెడ్డి గైర్హాజరు
● ఎమ్మెల్యే మాధవిరెడ్డి రాక
ఆలస్యం..ప్రసంగానికి దూరం
● నేతల ప్రసంగాలకు
కొరవడిన స్పందన
● ఉత్సాహం నింపని టీడీపీ కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభ
కడప రూరల్ : జిల్లా తెలుగుదేశం పార్టీ గురువారం స్థానిక పుత్తా ఎస్టేట్‌లో నిర్వహించిన టీడీపీ కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభ వెలవెలబోయింది. ఈ కార్యక్రమం అటు నేతల్లో, ఇటు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపక పూర్తిగా కళ తప్పింది.
అధిష్ఠానంపై ‘వాసు’ గుర్రు
కడప నియోజకవర్గంలో ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సీటు దక్కకపోవడంతో ఆయన తన అసమ్మతిని ఇన్‌స్టా పోస్టు ద్వారా బహిరంగంగానే వెళ్లగక్కారు. అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆయన కడప నియోజకవర్గంలో విజయోత్సవ సభ నిర్వహించలేదు. ఇదే సందర్భంలో కడప పుత్తా ఎస్టేట్‌లో నిర్వహించిన టీడీపీ కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభకు కూడా హాజరు కాకపోవడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సభకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి కార్యక్రమం మధ్యలో హాజరయ్యారు. అయితే, వేదికపైన ఆమె ప్రసంగించకపోవడం గమనార్హం. దీంతో వారిద్దరు టీడీపీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆ పార్టీకి చెందిన తమ్ముళ్లు బహిరంగంగా చర్చించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందోనని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.
గొప్పలకే పరిమితమైన నేతలు
కార్యక్రమానికి హాజరైన టీడీపీ కూటమి నేతలు అది చేశాం.....ఇది చేశామంటూ గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమయ్యారు. దీంతో సభకు వచ్చిన ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలతోపాటు ఇతరులు కూడా విసుగు చెందారు. నేతలు ఎంత గొప్పగా చెప్పుకున్నప్పటికీ కార్యకర్తల నుంచి కనీస స్పందన కూడా కరువైంది. కార్యక్రమం మధ్యలోనే జనాలు సభా కార్యక్రమం నుంచి బయటికి వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీ గా దర్శనమిచ్చాయి. సభకు వచ్చిన వారు ఇదేమి విజయోత్సవ సభ అంటూ వ్యాఖ్యానించడం కనిపించింది.
కళ తప్పిన సభ
పుత్తా ఎస్టేట్‌లో జిల్లా స్థాయి సభను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఏర్పాట్ల తీరును, జనాల రాకను పరిశీలిస్తే జిల్లా స్థాయి సభ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయోత్సవ సభ జనాలతో పోటెత్తుతుందేమోనని, సభా ప్రాంగణ ప్రాంతం గల బిల్టప్ కూడలి అంతా జనాలతో కిక్కిరిసిపోతుందని భావించారు. తీరా అక్కడికి వెళ్లిచూస్తే సభా ప్రాంగణం చిన్నదైనా ఖాళీ కుర్చీలే దర్శన మిచ్చాయి. జిల్లా జనాభాతో పోల్చుకుంటే ఈ సభకు వచ్చిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. రెండేళ్ల పాలన విజయవంతమైతే ప్రజలు విజయోత్సవ సభకు స్వచ్ఛందంగా రావడానికి ఆసక్తి చూపేవారని పలు వురు వ్యాఖ్యానించారు. రెండేళ్ల పాలన ఫెయి ల్యూర్ కావడం వల్ల ప్రజలు ప్రభుత్వం తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమైంది.


