కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియేట్ (జనరల్) మొదటి సంవత్సరానికి సంబంధించి మొత్తం 4410 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 1300 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 4262కి సంబంధించి 2348 మంది ఉత్తీర్ణులయ్యారు.
గురుకుల పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు
– వనిపెంటలో జూనియర్ కాలేజీని
ప్రారంభించిన మంత్రి సవిత
మైదుకూరు : రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్త మ ఫలితాలను సాధిస్తున్నారని బీసీ సంక్షేమం, చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గురువారం మండలంలోని వనిపెంట జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల స్థాయిని పెంచుతూ మంజూరు చేసిన జూనియర్ కాలేజీని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు మంచి సంస్కారాన్ని అలవర్చుకొని బాగా చదువుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడారు. పాఠశాల విద్యార్థులకు మంత్రి సవిత, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కలెక్టర్ శ్రీధర్ స్పోర్ట్స్ యూనిఫాంను అందజేశారు. బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్, మైదుకూరు తహసీల్దార్ రాజసింహ నరేంద్ర, పాఠశాల ప్రిన్సిపాల్ వి.నిర్మల తదితరులు పాల్గొన్నారు.
36.35 శాతం
ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ
కడప సెవెన్‌రోడ్స్ : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 15 నుంచి గురువారం వరకు జిల్లాలో 6,89,367 ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్‌ఓలు ఓటర్లకు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 1896231 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటికి 36.35 శాతం ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు అందజేశారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే బద్వేలు 86938 (39.15 శాతం), రాజంపేట 63514 (26.05), కడప 86797 (30.57), పులివెందుల 89738 (38.97), కమలాపురం 79,685 (38.55), జమ్మలమడుగు 99,663 (40.66), ప్రొద్దుటూరు 109537 (43.73),మైదుకూరు 73,495 (34.37)మందికి ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్‌ఓలు అందజేశారు. ఇందులో డిజిటైజ్డ్ 9431 (0.50 శాతం). ఇంకా డిజిటైజ్డ్ కాని ఎన్యుమరేషన్ పత్రాలు 1886548 (99.49 శాతం), బీఎల్‌ఓ వెరిఫికేషన్ లేకుండా ఓటర్లే సమర్పించిన ఎన్యుమరేషన్ పత్రాలు 167 (0.01 శాతం) ఉన్నాయి. బీఎల్‌ఓలు వెరిఫై చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు 9264 (0.49శాతం) ఉన్నాయి.
20న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రజక విభాగం సమావేశం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రజక విభాగం ముఖ్య నాయకుల సమావేశం ఈనెల 20వ తేది నిర్వహించనున్నామని ఆ విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోగిడి జయన్న ఒక ప్రకటనలో తెలిపారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజెప్పడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీన ఉదయం 9 గంటలకు తాడేపల్లి లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో 175 నియోజకవర్గాల వారీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రజక విభాగపు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని పార్టీ వివిధ అనుబంధ విభాగాలు, కమిటీలలో కొనసాగుతున్న రజకులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఓ గ్రామమే
ఓటరు జాబితాలో లేదు
కడప కార్పొరేషన్: స్పెషల్ ఇంటెన్సిల్ రివిజన్(సర్) కార్యక్రమంలో నిర్వహిస్తున్న ఓటర్ల వెరిఫికేషన్‌లో 2002 ఓటర్ల జాబితాలో రామరాజుపల్లె గ్రామ పంచాయితీలోని రామచంద్రాపురం గ్రామమే లేదు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు, 48వ డివిజన్ ఇన్‌చార్జి బంగారు నాగయ్య యాదవ్ గురువారం కడప నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను 60 ఏళ్లుగా ఆ గ్రామంలో ఉన్నానని, 45 ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నానని, 1989లో రామరాజుపల్లె ఉప సర్పంచ్‌గా పనిచేశానన్నారు. అయితే 2002 ఓటర్ల జాబితాలో తమ గ్రామంగానీ, అందులో ఓటర్లుగానీ లేరన్నారు. తనది, తన కుటుంబ సభ్యుల ఓట్లు అసలే లేవన్నారు. అధికారులు దీన్ని సవరించకపోతే న్యాయస్థానాన్ని అశ్రయిస్తానని తెలిపారు.


