పులివెందుల : వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు పోచమిరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిలకు పెద్ద దస్తగిరి బినామీ అంటూ, దీని వెనుక తాడేపల్లె పెద్దలు ఉన్నారంటూ కమలాపురం శాసనసభ్యుడు పుత్తా చైతన్యరెడ్డి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తదితరులు నిసిగ్గుగా మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన భర్త పెద్ద దస్తగిరి ఎవరికీ బినామీ కాదని, ఆయనకు వైఎస్సార్‌సీపీ నేతలతోనే కాక టీడీపీ నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని మృతుడి భార్య కలమల్ల రమణమ్మ స్పష్టంగా చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏమి జరిగినా వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ నేతలకు అంటగట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు టీడీపీ, కూటమి నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఇది వారి నీచ రాజకీయానికి పరాకాష్ట అని విరుచుకుపడ్డారు. కూటమి సర్కార్ వచ్చిన 23 నెలల్లో 21 రాజకీయ హత్యలు జరిగితే వాటిని వైఎస్సార్‌సీపీ నాయకులు, ఇతరులపై రుద్దడంలో కూటమి నేతలు సిద్ధహస్తులుగా మారారన్నారు. రెండు వారాలకు ముందు పెద్ద దస్తగిరి హత్య వ్యక్తిగతంగా జరిగితే.. దస్తగిరితో ఎలాంటి విభేదాలు లేని, పూర్తి సన్నిహిత సంబంధాలు ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని ఇరికించడం రాజకీయ లబ్ధికేనని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలు, ఉద్యమాల్లో నిత్యానందరెడ్డి చురుగ్గా పాల్గొంటున్నందునే ఆయనను నిందితుడిని చేశారని ఆందోళన వ్యక్తపరిచారు. వైఎస్సార్‌సీపీ వారిని చంపి, వారిపైనే దాడులు చేసి మళ్లీ వైఎస్సార్‌సీపీ వారినే నిందితులుగా చేసి జైలుకు పంపడం టీడీపీ, కూటమి నేతలకు పరిపాటిగా మారిందన్నారు.
వైఎస్ జగన్‌ను ఆశీర్వదిస్తే అర్చకులకు నోటీసులా?
ఒంటిమిట్ట కోదండ రామాలయం అర్చకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వేద ఆశీర్వచనంతోపాటు శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేస్తే వారికి టీటీడీ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం వెనుక కూటమి నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కాకపోవడంతో ఆయన సొంత జిల్లాకు రావడంతో.. అర్చకులు ఆయనను కలిసి ఆశీర్వదిస్తే దానిని నేరంగా పరిగణించడం ఏమిటని నిలదీశారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాక తప్పదని హెచ్చరించారు.


