కడప కార్పొరేషన్ : వ్యాపారులు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమంలో వివిధ అనుమతులను నిర్ణీత సేవా ప్రమాణాల కాలపరిమితిలో వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయడం జరుగుతోందని కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీరు సుధ కురుబా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ప్రతిపాదకులు తమ దరఖాస్తులను సమర్పించే సమయంలో అవసరమైన పూర్తి, సంబంధిత సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలు అందించిన పక్షంలో అదనపు వివరణ కోరాల్సిన అవసరం లేకుండా దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తవుతుందన్నారు. వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను దరఖాస్తు దారులు పాటించాలని ఆమె సూచించారు.
అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అతను కొన్ని రోజులుగా ఆస్పత్రి అత్యవసర విభాగం సమీపంలో ఉన్న పార్కింగ్ వద్ద పడుకొని ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అతను మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచారు. మృతుడికి సంబంధించిన వ్యక్తులు తగు ఆధారాలతో ఆస్పత్రి అధికారులను సంప్రదించాలని మార్చురీ ఇన్‌చార్జి వరాలు తెలిపారు.
జూదరులు అరెస్ట్
కొండాపురం: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ సమీపంలోని కంపచెట్లల్లో పేకాట ఆడుతుండగా 25 మందిని అరెస్ట్ చేసినట్లు కొండాపురం ఎస్‌ఐ జయరాయులు బుధవారం తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. స్థానికుల సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేసి 25 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి నగదు రూ. 2.42,730 స్వాధీనం చేసుకొని మూడు ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈఘటన పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బస్సును ఢీకొన్న
ద్విచక్ర వాహనం
పులివెందుల రూరల్ : పులివెందుల ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ39యూఎఫ్ 9451 అనే నెంబర్ గల బస్సు పులివెందుల నుంచి కదిరికి బయలుదేరి వెళ్లింది. నామాలగుండు – గొల్లపల్లె తండా మధ్య రోడ్డు పనులు జరుగుతుండగా తలుపుల వైపు నుంచి కనంపల్లె వైపు వస్తున్న ద్విచక్రవాహనం బస్సును ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనదారులు మా వాహనాన్ని బస్సుతో ఢీకొట్టాడని డ్రైవర్ మద్దిలేటి రెడ్డిని చితక బాదారు. దీంతో డ్రైవర్ మద్దిలేటిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తలుపుల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషయంగా ఉండడంతో కదిరి ప్రభుత్వ ఆసుపత్రి రెఫర్ చేసినట్లు సమాచారం.


