కడప కోటిరెడ్డిసర్కిల్ : ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప రైల్వే స్టేషన్‌లో బుధవారం పోలీస్, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్‌పీ అధికారులతో కలిసి పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ డాగ్ స్క్వాడ్ తో కలిసి ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం – కడప ఎక్స్‌ప్రెస్ రైలులోని బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ సెంటర్లు, అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి పార్సిల్‌ను పరిశీలించారు. ఎక్స్‌ప్రెస్ రైలులోని బోగీలను, ప్రయాణికుల లగేజీని తనిఖీ చేశారు. గంజాయి, మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972, పోలీసులకు లేదా డయల్ 112 కు తెలియజేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలియజేశారు. ఈ తనిఖీల్లో జిల్లా నార్కోటిక్ సెల్ ఇన్‌స్పెక్టర్ గోవింద రెడ్డి్, రిమ్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ చంద్రమోహన్, ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ నాగభూషణం, ఈగల్ టీం హెడ్ కానిస్టేబుళ్లు అయూబ్ ఖాన్, గుణశేఖర్, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.


