భళా భాస్కర్‌ | - | Sakshi
Sakshi News home page

భళా భాస్కర్‌

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

దొంగలను వెంటాడి పట్టుకున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ

బాధిత మహిళకు రూ.40వేలు అప్పగింత

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ట్రాఫిక్‌ ఎస్‌ఐ భాస్కర్‌ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు దొంగలను పట్టుకోవడమే గాక వాళ్లు దొంగలించిన డబ్బును బాధిత మహిళకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన భారతి అనే మహిళ తన తండ్రితో కలిసి బుధవారం సూపర్‌ బజార్‌ రోడ్డులోని ఎస్‌బీఐ బ్యాంక్‌కు వెళ్లారు. బ్యాంక్‌ నుంచి రూ.40వేలు విత్‌ డ్రా చేసుకుని ఆటో ఎక్కారు. అదే ఆటోలో ఇద్దరు దొంగలు ఎక్కారు. కొంత దూరం వెళ్లాక మహిళ వద్ద ఉన్న రూ.40వేలు పెట్టుకున్న పర్స్‌ను చాకచక్యంగా దొంగలించారు. మహిళ కోర్టు వద్ద ఆటో నిలిపి దిగారు. తన వద్ద డబ్బు పర్స్‌ లేకపోవడంతో గట్టిగా కేకలు వేయగా జనాలంతా గుమిగూడారు. అదే దారిలో వెళుతున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ భాస్కర్‌ వెంటనే ఆమె వద్దకు వెళ్లి విచారించారు. ఆటోలో వెళుతున్న ఇద్దరు దొంగలు తన డబ్బు దొంగలించారని చెప్పారు. దీంతో ఆటో వివరాలను సేకరించిన ఎస్‌ఐ వెంటనే ఆటోను వెంబడించి పట్టుకున్నారు. అందులో ఇద్దరు వ్యక్తులను బయటకు దించి డబ్బు గురించి అడిగారు. తాము దొంగలం కాదంటూ మొదట వాళ్లిద్దరకూ ఎస్‌ఐని దబాయించారు. అయితే తనదైన స్టైల్‌లో ఎస్‌ఐ భాస్కర్‌ అడగడంతో డబ్బులు ఇచ్చేశారు. ఎస్‌ఐ ఆ డబ్బుబు మహిళకు అందజేశారు. బాధిత మహిళ ఎస్‌ఐకి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ఎస్‌ఐ బ్లూకోల్ట్స్‌ టీంలను పిలిపించి ఇద్దరు దొంగలను త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. కాగా ఇద్దరు దొంగలు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటకు చెందిన వ్యక్తులుగా పోలీసుల విచారణలో తేలింది. వీళ్లిద్దరూ బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుని వెళుతున్న వారిని పసిగట్టి చోరీ చేస్తుంటారు. దొంగలను పట్టుకున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ భాస్కర్‌ను శభాష్‌ అంటూ స్థానికులు ప్రశంసించారు.

Advertisement
 
Advertisement
Advertisement