
యువకుడి ఆత్మహత్య
కొండాపురం : మండల పరిధిలోని వెంకయ్యకాలువ గ్రామానికి చెందిన తుడిమెల ప్రశాంత్ (22) సోమవారం విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ తెలిపారు. ఈ యువకుడు బాల్యం నుంచి చక్కెర వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూ ఉండేవాడు. చిన్న వయస్సులోనే చక్కెర వ్యాధి వచ్చిందని మనస్తాపం చెంది శనివారం విష ద్రావణం తాగాడు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
చియ్యపాడులో
కూలిన చౌడు మిద్దె
చాపాడు : మండల పరిధిలోని చియ్యపాడు గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వీఆర్‌ఏ (గ్రామ సేవకుడు)గా పని చేస్తున్న మండ్ల సిద్దయ్యకు చెందిన చౌడు మిద్దె కూలిపోయింది. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం అందరూ చూస్తుండగా సిద్దయ్యకు చెందిన చౌడు మిద్దె పై కప్పు కూలిపోయింది. రెండు రోజుల క్రితమే సిద్దయ్య బంధువుల ఇంటికి వెళ్లడంతో మిద్దె కూలిన సమయంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు అయింది. మిద్దె కూలి పోవడంతో తాను కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
కుక్క అడ్డు రావడంతో..
బ్రహ్మంగారిమఠం : బి.మఠంలోని గురుకుల పాఠశాల వద్ద సోమవారం సాయంత్రం సోమిరెడ్డిపల్లెకు చెందిన బొమ్ము రామమోహన్‌రెడ్డి అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. రామమోహన్‌రెడ్డి బి.మఠం నుంచి మైదుకూరుకు బైకుపై వెళ్తుండగా గురుకుల పాఠశాల సమీపంలో కుక్క అడ్డంగా వచ్చింది. దీంతో బైక్ కుక్కకు తగిలి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల : వైఎస్సార్ జిల్లాకు చెందిన సీఆర్ అసోసియేట్స్ సంస్థ అధినేత చరణ్ తేజ్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ.10,10,116 విరాళంగా అందించారు. ఈమేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీ అందజేశారు.

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య