పేకాట జోరు.. బతుకు తారుమారు | - | Sakshi
Sakshi News home page

పేకాట జోరు.. బతుకు తారుమారు

Jun 5 2025 8:06 AM | Updated on Jun 5 2025 8:06 AM

పేకాట జోరు.. బతుకు తారుమారు

పేకాట జోరు.. బతుకు తారుమారు

టాస్క్‌ఫోర్స్‌ : కూటమి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించకపోయినా పేకాట క్లబ్బులు మాత్రం అన్నమయ్య జిల్లాలోని మంత్రి ఇలాకాలో మూడు పువ్వులు 36 కాయలుగా కనిపిస్తున్నాయి. జాకీ, క్విన్‌, కింగ్‌, ఆన్‌ అంటూ పేకాట స్థావరాలు విరాజిల్లుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన ఖాకీ, ఖద్దరులే కాపలాగా మారి పేకాట స్థావరాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఒక్క చిన్నమండెం మండల పరిధిలోనే రోజుకు కోటి రూపాయలకు పైగానే పేకాట జరుగుతున్న మాట అక్షర సత్యం, రాయచోటి పట్టణ పరిధిలోని శివారు ప్రాంతాలలో నూతనంగా నిర్వహిస్తున్న గృహాలు, గ్రామీణ ప్రాంతాలలోని మామిడి తోటలు, ఫామ్‌ హౌస్‌లలో పేకాట జోరుగా నడుస్తోంది. ఆట నిర్వహణ ద్వారా రోజుకు లక్షల రూపాయలు ఆదాయాన్ని నిర్వాహకులు గడిస్తున్నారు. వచ్చిన ఆదాయంలో మంత్రి అనుయాయులకు సగం డబ్బులు ముడుతున్నట్లు ప్రచారం ఉంది. ఆటలలో పాల్గొని వారి నుంచి ఎంట్రీ ఫీజుగా రూ. 3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వీటి నిర్వహణలో పోలీస్‌ శాఖలోని ఓ నిఘా అధికారి ఇటీవలనే పేకాట కారణంగా సస్పెండ్‌కు గురైనా పోలీసు హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటితోపాటు పక్కనే ఉన్న చిన్నమండెం మండలంలో పేకాట జోరుగా సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కూర్చున్న చోటనే సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో కొంతమంది జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఆశకు వెళ్లి జీవితాలను చిన్నాభినం చేసుకుంటున్నారు. మంత్రి నియోజకవర్గమైన రాయచోటి, ఆయన సొంత మండలమైన చిన్నమండెం మండల పరిధిలోని పలు ప్రాంతాలలో జాద శాలలు నడుస్తున్నాయి. ఎవరైనా పోలీసులకు సమాచారం ఇచ్చినా మంత్రి ఇలాకాలోని గ్రామాలలోకి పోలీసులు అడుగులు వేయలేకపోతున్నారు. ఒకవేళ దాడులు నిర్వహించినా స్టేషన్‌కు వెళ్లకుండానే పట్టుబడిన పేకాట రాయుళ్లు దర్జాగా ఇళ్లకు వెళ్తున్నారు. స్థానిక పోలీసుల నుంచి చర్యలు లేకపోవడంతో జిల్లా ఎస్పీ నేరుగా కొంతమంది సిబ్బందిని నియమించుకొని కఠిన చర్యలు చేపడుతున్నా జూదరుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదన్న వాదనలు ఉన్నాయి. అనేక మంది వ్యాపారులు, ఉద్యోగులు, సాధారణ కుటుంబ సభ్యులు లక్షలు, కోట్ల రూపాయలు ఆస్తులు అమ్మి పేకాటలో పెట్టి నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.

ఇల్లు.. మామిడి తోటలే అడ్డాలు..

ఎవరికీ అనుమానం రాకుండా పేకాటరాయుళ్లు ఇల్లు, మామిడి తోటలు, ఫామ్‌ హౌసులు, అటవీ ప్రాంతాలలో ప్రత్యేక స్థావరాలపై ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆట ఆడేవారికి మినహా మరెవ్వరికీ సమాచారం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా పేకాట స్థావరాల వద్దకు జనం చేరుకుంటున్నారు. చీకటి పడే వరకు ఈ ఆటలు కొనసాగుతున్నాయి. రోడ్ల వెంట సీసీ కెమెరాలు, ఇన్‌ఫార్మర్లను పెట్టుకొని జూద శాలలను నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఇతర జిల్లాల నుంచి..

అన్నమయ్య జిల్లాలోని పేకాట స్థావరాలకు స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా జూదరులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కడప, చిత్తూరు, అనంతపురం, కర్ణాటక రాష్ట్ర ప్రాంతాల నుంచి జూదరులు వస్తున్నారు. గ్రామాల వారిగా పోలీసులకు బాధ్యతలు అప్పగించినా దాడులు చేసి వాటి నివారణ చర్యలు చేపట్టిన సంఘటనలు లేవనే చెప్పవచ్చు. పేకాట ఆడుతున్న సమయంలో ఎవరైనా పోలీసులు దాడులు చేస్తే చాలా మంది జూదరులు వారి కళ్లు గప్పి పారిపోతున్నారు.

జిల్లా వ్యాప్తంగా..

మంత్రి ఇలాకాలో విచ్చలవిడిగా జరుగుతున్న పేకాట కారణంగా మంత్రి అనుయాయులకు రోజువారిగా సమకూరుతున్న ఆదాయాన్ని చూసి జిల్లాలోని మిగిలిన నేతలు కూడా పేకాట స్థావరాల నిర్వహణకు మెగ్గుచూపుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసు శాఖలో పనిచేస్తూ సస్పెండ్‌కు గురైన కానిస్టేబుల్‌, కడపలో పోలీసులకే డాన్‌గా వ్యవహరిస్తున్న అశోక్‌ రెడ్డి, మదనపల్లికి చెందిన హేమంత్‌ రెడ్డి, చిన్నమండెంలోని నర్సరీ రమణ, మల్లూరు శేఖర్‌ రెడ్డి, నిఘా అధికారికి అత్యంత సన్నిహితుడైన డాబా అంజిలతోపాటు రాయచోటిలో మంత్రి ముఖ్య అనుచరుడు వీటి నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది.

అడ్డుకట్ట పడేది ఎలా. ?

విచ్చలవిడిగా జరుగుతున్న పేకాటను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టడం అవసరం. జూదం ఆడేవారికి కోర్టులో కఠిన శిక్షలు లేకపోవడంతో చాలా మంది పట్టుబడినా తమ ప్రవర్తన మార్చుకోవడం లేదని తెలుస్తోంది. పట్టుబడిన జూదరులు బయటకు వచ్చి మరలా పేకాట ఆడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెస్తే తప్పా జూదానికి అడ్డుకట్ట పడేలా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జాకీ, క్వీన్‌, కింగ్‌, ఆన్‌ అంటూ జిల్లాలో పేకాట స్థావరాలు

ఎక్కడికక్కడ జేబులు నింపుకుంటున్న మంత్రి అనుయాయులు

రోజుకు టర్నోవర్‌ కోటి రూపాయలు పైబడే

రాయచోటి, చిన్నమండెం కేంద్రాలుగా యథేచ్ఛగా జూదం

అన్నమయ్య జిల్లాలో విస్తరిస్తున్న పేకాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement