
‘పది’ సప్లిమెంటరీకి వేళాయె
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి ఈ నెల 28 వరకు జరగనున్నాయి. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణులు కాని వారి కోసం.. ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెగ్యులర్ పదో సప్లిమెంటరీని 5667 మంది విద్యార్థులు.. ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలను 1484 మంది రాయనున్నారు.
ప్రత్యేక తరగతులు
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలు తప్పిన విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఆయా సబ్జెక్టులకు చెందిన ఉపాధ్యాయులు రోజూ క్లాస్‌లు తీసుకుని విద్యార్థులను తీర్చిదిద్దారు. జిల్లా వ్యాప్తంగా 5767 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 28 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఓపెన్ పది, ఇంటర్ విద్యార్థుల కోసం..
ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 1484 మంది రాయనున్నారు. వీరి కోసం 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 19 నుంచి 24 వరకు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
అధికారుల నియామకం:
పది సప్లిమెంటరీ పరీక్షల పర్యవేక్షణకు అధికారుల నియామకం పూర్తయింది. 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 28 మంది డిపార్ట్‌మెంట్ అధికారులతోపాటు నలుగురు స్క్వాడ్ సభ్యులను నియమించారు. అలాగే ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలకు 13 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 13 డిపార్ట్‌మెంట్ అధికారులతోపాటు స్క్వాడ్ సభ్యులను సిద్ధం చేశారు.
నేటి నుంచి 28 వరకు పరీక్షలు
జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాలు
పకడ్బందీగా ఏర్పాట్లు
ఏర్పాట్లు పూర్తి
జిల్లా వ్యాప్తంగా ప్రారంభం అవుతున్న పది సప్లిమెంటరీ పరీక్షలతోపాటు ఓపెన్ పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాం. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం.
– షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి

‘పది’ సప్లిమెంటరీకి వేళాయె