
మహానాడు పేరిట వసూళ్ల పర్వం!
ప్రైవేట్ ఆస్పత్రులు రూ.లక్ష చెల్లించాలని డాక్టర్లకు హుకుం
నిన్నటి వరకు కడపలో సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలు ఇవ్వాలని డిమాండ్
ఇప్పుడు ఆ డబ్బులు తమకే ఇవ్వాలని పట్టు?
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు కొత్త దందాకు తెరతీశారు. కడపలో టీడీపీ మహానాడు కోసం మహా కలెక్షన్ మొదలుపెట్టారు. నిన్నటి వరకు కడప నగర అభివృద్ధి పేరుతో ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నామని చెప్పినవారు... నేడు ఆ సొమ్మును మహానాడు పేరుతో తమ జేబులో వేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల్లో గెలవడం కోసం మాధవిరెడ్డి కడప నగరాభివృద్ధి కోసం చేసే పనుల వివరాలు తెలియజేస్తూ సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఇందులో భాగంగా కడప నగరంలోని ప్రతి వీధిలో సీసీ కెమెరాలు పెడతానని హామీ ఇచ్చారు. ఆమె గెలిచి ఏడాదైనా ఒక్క హామీ నెరవేర్చలేదని ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో ఎన్నికల ముందు సొంత నిధులతో నగరాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన భార్యాభర్తలు, ఇప్పుడు విరాళాల పేరుతో బలవంతంగా వసూళ్లపర్వం మొదలుపెట్టారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలు ఇవ్వాలని ప్రముఖులకు వాట్సాప్ మెసేజ్‌లు పంపారు. ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలో కూడా వారే నిర్ణయించారు.
ఎమ్మెల్యే సూచన మేరకు నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు రూ.లక్ష చొప్పున విరాళం ఇవ్వాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నగర శాఖ ఆదేశించింది. ఎస్పీ పేరిట చెక్ లేదా డీడీ ఇవ్వాలని సూచించింది. దీనిపై విమర్శలు రావడంతో ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఎస్పీ ప్రకటించినట్లు తెలిసింది. ఇదే సమయంలో కడపలోనే మహానాడు నిర్వహిస్తుండడంతో ఎస్పీకి చెక్ లేదా డీడీ ఇవ్వాలన్న నేతలు ఇప్పుడు నేరుగా నగరంలోని ప్రముఖులందరికీ ఫోన్లు చేసి తమకే ఆ లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
నగర అభివృద్ధి అనేది పక్కకుపోయి, ఇప్పుడు మహానాడు ఖర్చుల కోసం కొత్త కలెక్షన్లకు తెరలేపారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విరాళల కోసం శ్రీనివాసులురెడ్డి నేరుగా వైద్యులకు ఫోన్లు చేస్తున్నట్లు పలువురు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే కొంతమంది డాక్టర్లు డబ్బులు ముట్టజెప్పినట్లు సమాచారం.
నగరాభివృద్ధి కోసమే అయితే
‘కడప నగరాభివృద్ధికి చేయూతనివ్వండి. నేరాల కట్టడికి మీ వంతు బాధ్యతగా కృషి చేయండి. సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించండి’ అని కోరితే ఆసక్తిగలవారు ముందుకొస్తారు. దాతలు నేరుగా సీసీ కెమెరాలను అందజేస్తారు. కానీ, ఇక్కడ దాతలకు ఆ వెసులుబాటు లేదు. బలవంతంగా తాము ఎంత చెబితే అంత సమరి్పంచుకుని వెళ్లాల్సిందేనని హుకుం జారీ అయ్యింది. తొలుత సీసీ కెమెరాల పేరుతో వైద్యులు మాత్రమే రూ.లక్ష ఇవ్వాలని ఆదేశాలు వెళ్లాయి.
ఇప్పుడు నగరంలోని ప్రముఖులకు ఫోన్లు చేసి మరీ ఎంత విరాళం ఇవ్వాలో చెబుతున్నారని పలువురు వాపోతున్నారు. ఇలాంటి సంస్కృతి కడపలో మునుపెన్నడూ లేదని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేశారని, పైసా కూడా ప్రజల నుంచి విరాళం తీసుకోలేదని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, ఆమె భర్త ఏడాదిలోనే ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాలను స్వాహా చేస్తున్నారని, విరాళాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.