
పీఎం సూర్యనూ.. సీఎం చంద్రన్ననూ నమ్మని జనం
‘వంద అడుగులు ఉన్న ప్రతి ఇంటిపైనా ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోండి..’ఏపీఎస్‌పీడీసీఎల్ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఇవి. దీంతో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పరుగులు పెడుతున్నారు. ఎంత అవగాహన కల్పించినా సదరు పథకాన్నీ..సీఎం చంద్రబాబు మాటల్ని నమ్మలేమంటూ జనాలు ఆసక్తిచూపకపోవడంతో సిబ్బందికి ఇబ్బంది తప్పడం లేదు.
కడప కార్పొరేషన్: మన ఇంట్లోనే సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభు త్వం లక్ష్యంగా నిర్దేశింది. ఈ మేరకు వైఎస్సార్ కడప జిల్లాలో లక్ష గృహాలకు సోలార్ రూఫ్ టాప్ అమర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ పథకం మంచిదే అయినా కొన్ని చోట్ల వినియోగదారులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పీఎం సూర్యఘర్ పథకంపై వినియోగదారులకు అవగాహన కల్పించి ఏర్పాటు చేయాలని కూటమి సర్కార్ డిస్కమ్‌లపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
● ఈ పథకంలో చేరాలంటే ముందుగా ‘సూర్యఘర్’యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అందులో వివరాలు నమోదు చేయాలి. ఆరునెలల కరెంటు బిల్లు కాపీలను జతపరచాలి. తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యుత్ వాడకం 300 యూనిట్లలోపు మాత్రమే ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ అందరికీ వర్తింపజేస్తున్నారు. ట్రాన్స్ కో అనుమతులు పొందాక వెండర్లను ఎంపిక చేసుకోవాలి. ఇందులో కిలోవాట్‌కు నిర్ణయించిన దాని ప్రకారం రాయితీని అందిస్తారు. మిగిలిన మొత్తానికి బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయి. చివరగా ఇంటి పై కప్పుపై 100 చదరపు అడుగుల స్థలంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం వాడే మీటర్ స్థానంలో నెట్ మీటర్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా సోలార్ ఉత్పత్తిని...వినియోగదారుడు వాడుతున్న విద్యుత్‌ను లెక్కిస్తారు.
కరెంట్ అమ్ముకోండి... అంటూ ప్రచారం
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు...ఇప్పుడు ఎఫ్‌పీసీసీఏ చార్జీల మోత మోగిస్తూ గుండె గుభేల్‌మనేలా చేస్తున్నారు. సంపద సృష్టించడం తనకు బాగా తెలుసునన్న బాబు, ఓవైపు విద్యుత్ బిల్లులను అమాంతం పెంచేసి, మరోవైపు సూర్యఘర్ ప్రాజెక్టు పేరుతో వినియోగదారుల నడ్డి విరిచేందుకు యత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోలార్ రూఫ్ టాప్ అమర్చుకుంటే బిల్లు కట్టకపోవడంతోపాటు కరెంటు మీరే అమ్ముకొని లాభాలు పొందవచ్చునంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. అయినా ప్రజలు స్పందించకపోవడంతో అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలో సర్కిళ్లలోని జోన్ల వారీగా లక్ష్యాలు విధించారు. నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
పీఎం సూర్యఘర్ పథకంపై లక్ష్యం విధింపు
కేంద్రం ఆదేశాలతో ఏపీఎస్‌పీడీసీఎల్ అధికారుల ఉరుకులు పరుగులు
ప్యానెల్స్ పెట్టుకోవాలంటూవినియోగదారులకు అవగాహన
ఆసక్తి చూపని జనం

పీఎం సూర్యనూ.. సీఎం చంద్రన్ననూ నమ్మని జనం

పీఎం సూర్యనూ.. సీఎం చంద్రన్ననూ నమ్మని జనం