
ఆన్‌లైన్ బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు
కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి కడపజిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పొరేషన్, మునిపాలిటీ యాజమాన్యాల్లో పనిచేసే గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు బుధవారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు . తప్పనిసరి బదిలీ అయ్యేవారు.. అభ్యర్థన బదిలీల కోరేవారు నేటి నుంచి ఆన్‌లైన్‌లో బదిలీ అప్లికేషన్ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని డీఈఓ సూచించారు.
81 మంది హాజరు
కడప ఎడ్యుకేషన్: పదవ తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన హిందీ పరీక్షకు 81 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 28 పరీక్షా కేంద్రాలలో 223 మంది విద్యార్థులకుగాను 81 మంది హాజరుకాగా 142 మంది గైర్హాజయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ నాలుగు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని డీఈఓ తెలిపారు.
దరఖాస్తు గడుపు పొడిగింపు
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో చేరేందుకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు పొడగించినట్లు ఐటీఐల జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. 10వ తరగతి పాస్ లేక ఫెయిల్‌తోపాటు ఆపై విద్యార్హతలు కలిగి ఆసక్తి కల్గిన అభ్యర్థులు తమ దగ్గరలోని ఏ ప్రభుత్వ ఐటీఐ వద్దకు వెల్లి iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తును రిజిస్వేషన్ చేసుకో వాలని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. రిజిస్టర్ చేసిన దరఖాస్తును తప్పని సరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు.
దరఖాస్తుల వెల్లువ
కడప అర్బన్: కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, వైద్య కళాశాల (రిమ్స్)ఆవరణలోని సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లో పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ హాస్పిటల్‌లో కాంట్రాక్ట్ విధానంలో 19 పోస్టులు, ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో 50 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మంగళవారం ఆఖరిరోజు కావడంతో నిరుద్యోగులు వెల్లువలా వచ్చారు. సిబ్బంది పోస్టుల వారీగా కౌంటర్‌లను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు.
ఏపీ ఐసెట్‌లో
మెరిసిన రైతుబిడ్డ
కడప ఎడ్యుకేషన్: ఏపీ ఐసెట్ ఫలితాల్లో రైతు బిడ్డ సందీప్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో వ్యవసాయ కుటుంబానికి చెందిన ద్వారకచర్ల జగదీశ్వర్‌రెడ్డి, సావిత్ర దంపతుల కుమారుడు సందీప్‌రెడ్డి ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యాభ్యాసం స్థానికంగా, ఇంటర్‌ను హైదరాబాదులోని నారాయణ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీని డిల్లీలోని హిందూ కళాశాలలో పూర్తి చేశాడు. ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెనెజ్‌మెంట్(ఐఐఎం)లో ర్యాంకు సాధించాలనేదే తన లక్ష్యమని.. త్వరలో జరిగే ఐఐఎంలో కూడా మంచి ర్యాంకు సాధిస్తానని సందీప్‌రెడ్డి తెలిపారు.
పోలీస్ జాగిలం మృతి
కడప అర్బన్: జిల్లా పోలీస్ శాఖకు 2013 నుంచి విశేష సేవలందించి తొమ్మిది నెలల కిందట పదవీ విరమణ పొందిన పోలీస్ జాగిలం ’సన్నీ’ మంగళవారం వయోభారంతో మృతిచెందింది. ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ టైటస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ’సన్నీ’ పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. లాబ్రడార్ జాతికి చెందిన సన్నీని పలు వీవీఐపీల బందోబస్తు విధులు, సీఎం బందో బస్తు విధులు, గోదావరి పుష్కరాలు, తిరుమల బ్రహ్మోత్సవాలలో విధులకు తీసుకెళ్లారు. అసెంబ్లీ బందోబస్తు, ఎన్నికల బందోబస్తు విధుల్లో సమర్ధంగా విధులు నిర్వహించి ఆ జాగిలం ప్రశంసలందుకుంది. దీంతో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఆన్‌లైన్ బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు

ఆన్‌లైన్ బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు