
టీడీపీలో నయా నియంత!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో జెండా మోసినోళ్లకే పెద్దపీట.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడంతా వ్యక్తిగత భజన చేసినోళ్లకే పదవులు. ముఖ్యంగా కడప గడపలో అక్షరాల ఇదే నిజమని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ఆశించిన గుర్తింపు లభించలేదు. పైగా భౌతికదాడులు తెరపైకి వస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే నియంతృత్వం రాజ్యమేలుతోందని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు.
● కడప నియోజకవర్గంలో టీడీపీ విపక్షంలో ఉండగా జి.లక్ష్మిరెడ్డి, ఎస్. గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్, అమీర్‌బాబు ఈ నలుగురు ప్రధానంగా తెరపై కన్పించేవారు. ఇప్పుడు వారి పరిస్థితి, ప్రాధాన్యత ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చని టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడొకరు చెప్పుకొస్తున్నారు. పైగా మినీ మహానాడు సందర్భంగా ఆ నలుగురు కూడా వాట్సాప్ మేసేజ్ ద్వారా హాజరు కావాల్సిన దుస్థితి నెలకొంది. అందులో ఇద్దరికి వాట్సాప్ మేసేజ్ కూడా అందలేదని తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు తెరపైకి వస్తున్న తరుణంలో చాలా వరకూ పార్టీనే సర్వస్వం అనుకున్న వారు క్రమంగా కనుమరుగు అవుతూ వస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొందని పలువురు వివరిస్తున్నారు.
చిన్నచౌక్ కార్యాలయం మూత...
ఎమ్మెల్యేగా మాధవీరెడ్డి ఎన్నికై న తర్వాత అప్సరా హాల్ సమీపంలో 1 నుంచి 13 డివిజన్లు కోసం ఎమ్మెల్యే కార్యాలయం ప్రారంభించారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాంప్రసాదరెడ్డి కేంద్ర బిందువుగా ఏర్పాటైనా ఆ కార్యాలయం సరిగ్గా ఆరునెలలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి మూపించారని ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయం ప్రారంభించడం ఎందుకు? అంతలోనే మూపించడం ఎందుకని ‘తమ్ముళ్లు’ ప్రశ్నిస్తున్నారు. నగరంలో మాధవిరెడ్డి విజయం కోసం రాంప్రసాదరెడ్డి, మరోవైపు రూరల్‌లో పాతకడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి విశేషంగా పనిచేశారు. ఏడాది తిరక్కముందే ఆ ఇరువురితో అంటీ ముట్టనట్లుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికారిక పర్యటనల్లో కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికి కనీస పిలుపు లేకుండా పోతోందని పలువురు వాపోతున్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం బ్రౌన్ లైబ్రరీ, స్టార్టప్ కార్యాలయాలకు భూమిపూజ కార్యక్రమాలను పలువురు ఉదహరిస్తున్నారు.
ఆ కార్పొరేటర్లే పెద్దదిక్కు...
కడప గడపలో తలలు పట్టుకుంటున్న టీడీపీ నేతలు
విజయం కోసం పనిచేసిన నేతల్లో తీవ్ర అసంతృప్తి
పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినా నేతల్లో నిస్తేజం
నేడు రాజరాజేశ్వరీ కళ్యాణమండపంలో మినీ మహానాడు
తెలుగుదేశం పార్టీకి ఉమాదేవి ఒక్కరే కార్పోరేటర్. ఉన్న ఒక్కగానొక్క కార్పొరేటర్‌ను చేరదీయడం అటుంచితే, నిండు సభలో అవమానించారు. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఆ విషయం ప్రస్ఫుటమైంది. మరోవైపు 8మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లును బెదిరించి బలవంతంగా తెలుగుదేశం కండువా కప్పా రు. అందుకు 8వ డివిజన్ కార్పొరేటర్ ఉదంతమే నిదర్శనం. కార్పొరేటర్ వెంచర్‌పైకి కార్పొరేషన్ అధికారులను ఉసిగొల్పి, ఆపై కార్పొరేటర్ దంపతులకు టీడీపీ కండువా కప్పారు. ఇలా బెదిరింపులకు లొంగి టీడీపీలో చేరిన వారే ప్రస్తుతం కడపలో టీడీపీకి పెద్ద దిక్కయ్యారని పలువురు సీనియర్లు వాపోతున్నారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా ప్రెస్‌మీట్ పెట్టాలన్నా వారే, భజన చేయాలన్నా వారే ప్రధానంగా నిలుస్తున్నారని విశ్లేషకులు సైతం వెల్లడిస్తున్నారు. ఈ తరుణంలో బుధవారం రాజరాజేశ్వరీ ఫంక్షన్ హాల్‌లో కడప మీనీ మహానాడు నిర్వహిస్తున్నారు. ఆవిర్భావం నుంచి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఏపాటి మర్యాద లభిస్తోందో వేచిచూడాల్సిందే!