గుట్టలు కరుగుతున్నాయ్
పులివెందుల రూరల్ : టీడీపీ నాయకుల భూ దాహానికి గుట్టలన్నీ కరిగిపోతున్నాయి. యథేచ్చగా ఎక్కడపడితే అక్కడ మట్టి తవ్వి అమ్ముకుంటూ తమ జేబులు నింపుకొంటున్నారు. దీంతో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరంగాపురం సమీపంలో ఉన్న పిల్లిగుట్ట రోజు రోజుకూ కరిగిపోతోంది. ఈ మట్టి మఫియాకు కూటమి నేతల అండ దండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. దీంతో జేసీబీలు పెట్టి యథేచ్ఛగా ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారు. ట్రాక్టర్ మట్టి రూ.2 వేల వరకు విక్రయిస్తూ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. పులివెందుల మున్సిపాలిటీలో ఈ దందా ఇటీవల పెరిగిపోయింది. ఈ విషయమై తహసీల్దారు నజీర్ అహమ్మద్ వివరణ కోరగా మట్టి తరలించడం చట్టరీత్యా నేరం.. మట్టి తవ్వకాలు జరిపే వారిపై చర్యలు చేపడతామన్నారు.
అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలి
చిన్నరంగాపురం పరిధిలోని పిల్లిగుట్టలో మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తూ కూటమి నాయకులు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, అక్రమ తవ్వకదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పులివెందుల వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు వి.రామ్‌లక్ష్మణ్‌రెడ్డి, బాలక్కగారి వెన్నపూసప్రతాప్‌రెడ్డి, రాజుల వివేకానందరెడ్డి, రాజుల సుధీర్‌రెడ్డి, వెన్నపూస రామకేశవరెడ్డి, పెద్ద రంగాపురం వైఎస్‌ఆర్సీపీ నాయకులు తహసీల్దారు నజీర్ అహ్మద్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పిల్లిగుట్ట నుంచి అధికారుల అనుమతులు లేకుండా లక్షల రూపాయల విలువైన మట్టి రవాణా జరుగుతోందన్నారు. ధనార్జనే ధ్యేయంగా సామాన్యుల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ సామాన్యులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ట్రాక్టర్‌కు సామాన్యుల చెంత రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు డబ్బు వసూలు చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడంతో మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నాకుల ఆగడాలకు అధికారులు అడ్డుకట్ట వేయకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామన్నారు.
గుట్టలు కరుగుతున్నాయ్


