పౌరసరఫరాల రాష్ట్ర చైర్మన్ ఆకస్మిక తనిఖీ
కడప సెవెన్‌రోడ్స్ : పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్ తోట మెహర్ సీతారాం సుధీర్ శనివారం కడప నగరంలోని సివిల్ సప్లైస్ స్టాక్ బఫర్‌గోడౌన్, ఎంఎల్‌ఎస్ పాయింట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కడప డీఎం కార్యాలయంలో జిల్లా ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇన్‌చార్జిలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇన్‌చార్జిలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు పరిశీలించి పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు .స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ నుంచి స్టాక్ పాయింట్లకు లూజ్ బ్యాగులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోడౌన్లలో స్టాకింగ్ స్ప్రేయింగ్ సరిగా లేనందున తక్షణమే నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు.
పత్రికా స్వేచ్ఛను కాపాడాలి
ఎర్రగుంట్ల : పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యహరిస్తోందని ఎర్రగుంట్ల పాత్రికేయులు అన్నారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు పాత్రికేయులపై డీజీపీ ఆదేశాల మేరకు తప్పుడు కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఎర్రగుంట్ల పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల ఏఎస్‌ఐ శంకర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతు పల్నాడు జిల్లా మాచర్లలో హరిశ్చంద్ర అనే వ్యక్తి హత్య కేసును బాధితుల కథనం మేరకు సాక్షి దినపత్రిలో ప్రచురించారని తెలిపారు. టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ఎగ్జిక్యూటివ్ మెంబర్ వల్లెపు శ్రీనివాసులు, పాత్రికేయులు హబీబ్, జయంత్, లక్ష్మీనారాయణ, బాలాంజనేయులురెడ్డి, శ్రీనివాసులు, డాక్టర్ నారాయణ, రఘరాముడు తదితరులు పాల్గొన్నారు
ఎం.రాచపల్లి.. చిన్నారుల మృతితో తల్లడిల్లి..
చిట్వేలి : మండల పరిధిలోని ఎం.రాచపల్లిలో శుక్రవారం ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందిన సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన చొక్కారాజు దేవాన్స్ (7) తండ్రి నరసింహారాజు, తల్లి చంద్రకళ. వీరికి ఇద్దరు కుమారులు కాగా దేవాన్స్ పెద్ద కుమారుడు. అలాగే చొక్కారాజు విజయ్ (7) తండ్రి శేఖర్ రాజు, తల్లి విజయలక్ష్మీ. వీరికి ముగ్గురు కుమారులు కాగా విజయ్ చిన్న కుమారుడు. అలాగే రెడ్డిచర్ల యశ్వంత్ (6) తండ్రి వెంకటేష్, తల్లి సుప్రజ. వీరికి ముగ్గురు కుమారులు కాగా యశ్వంత్ పెద్దకుమారుడు. విజయ్ తండ్రి శేఖర్ రాజు, యశ్వంత్ తండ్రి వెంకటేష్ ఇద్దరు జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి ఉన్నారు. సంఘటన జరగడంతో శనివారం స్వగ్రామం చేరుకొని కుమారుల మృతిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమై కుప్పకూలిపోయారు. తల్లిదండ్రుల దుఃఖాన్ని చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. మృతులు యశ్వంత్, విజయ్ చిట్వేలిలో ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతుండగా దేవాన్స్ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతునాడు. వీరి మృతితో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
పౌరసరఫరాల రాష్ట్ర చైర్మన్ ఆకస్మిక తనిఖీ
పౌరసరఫరాల రాష్ట్ర చైర్మన్ ఆకస్మిక తనిఖీ


